వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయనని.. చంద్రబాబు ఇష్ట ప్రకారం పోటీ చేస్తాను అంటూ పార్టీ మార్పుపై కుండబద్దలు కొట్టారు. గత కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి.. బుధవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. తన దగ్గర ఇందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాక వాటిని మీడియా ఎదుట బయటపెట్టారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పార్టీ కార్యాలయంలో ఇలాంటి మీటింగ్ పెట్టాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. వైసీపీ పార్టీకి నేను ఎంత వీర విధేయుడినో.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ అన్నా నాకు అంతే అభిమానం. ఐదేళ్ల క్రితం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చిత్తశుద్దితో పనిచేశాను. పార్టీ అధికారంలోకి వచ్చాక.. నేను ప్రత్యేక గుర్తింపును కోరుకున్నాను. దీన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే నాకు గుర్తింపు రాకున్నా పార్టీ కోసం, జగన్ కోసం పని చేశాను. ప్రజా సమస్యలపై జనాల తరఫున పార్టీని ప్రశ్నించాను. పార్టీ పట్ల ఎంత విధేయతతో ఉన్నానో.. ప్రజా సమస్యలపై కూడా అలానే అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించాను. ఎప్పుడు కూడా వైఎస్ జగన్ గురించి, పార్టీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. ఆగస్ట్ నుంచి నిధుల కోసం పోరాడుతున్నాను’’ అని తెలిపారు.
‘‘పార్టీకి విధేయుడిగా ఉన్న నన్ను అవమానిస్తున్నారు. గడపగడపకు కార్యక్రమం కన్నా ముందే నేను కార్యకర్తల దగ్గరకు వెళ్లాను. కార్యకర్తల కష్టం నాకు తెలుసు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. దీని గురించి ఓ ఐఏఎస్ అధికారి నాకు సమాచారం ఇచ్చాడు. దీనిపై నాకు స్పష్టమైన సాక్ష్యం దొరికింది. నాయకుడే నమ్మకపోతే.. నేను ఇంకా పార్టీలో ఉండటం ఎందుకు.. ఒక ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడితే.. ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయి. అందుకే అలా చేయడం నాకు ఇష్టం లేదు’’ అన్నారు.
‘‘ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నాతో మాట్లాడారు. నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతంది అని నాతో చెప్పాడు. ట్యాపింగ్ కాదు అంటే నిరూపించండి. నాకు నటించడం రాదు. ఇంచార్జ్‌ను మారిస్తే కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు. నేను వైసీపీ నుంచి పోటీ చేయదల్చుకోలేదు. భవిష్యత్తు ఏంటనే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాను. నమ్మకం లేని చోట నేను ఉండలేను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు ఇష్టం ప్రకారం పోటీ చేస్తాను. ఇప్పటి వరకు టీడీపీ వాళ్లు ఎవరు నాతో మాట్లాడలేదు’’ అంటూ సంచలన ప్రకటన చేశారు కోటంరెడ్డి. మరి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి