కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్సార్‌సీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. గత కొద్ది రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో పాటు, పోలీసు కేసుల వరకు వెళ్లడంతో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆ పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుకు అధిష్టానం నుంచి పిలుపు రాగా.. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత శివభరత్ రెడ్డి ఎమ్మెల్యే వంశీని టార్గెట్ చేశారు. వంశీతో కలిసి తాము పనిచేయలేమని తెగేసి చెప్పారు.
ఈ సందర్భంగా శివ భరత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నుంచి గెలిచి.. ఆ పార్టీకి రాజీనామా చేయకుండా.. వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ‘గడప గడపకు’ కార్యక్రమంలో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత అయిన వంశీ.. వైసీపీ సర్కారుకు సంబంధించిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడిన వంశీ.. ఆస్తులను కాపాడుకోడానికే వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ నడిచిన మార్గాల్లో పసుపు నీళ్లతో కడిగించిన ఘటనల్ని తాము ఇంకా మర్చిపోలేదన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని వేధించారన్నారు. అలాంటి వ్యక్తితో తాము కలవలేమని తేల్చి చెప్పాడు.
ఇది కూడా చదవండి: TDP పార్టీ ముందు జగన్ ఓ బచ్చా: చంద్రబాబు నాయుడు
వంశీ వైఎస్ విగ్రహాన్ని చెత్తకుప్పలో వేయించారని శివ భరత్ రెడ్డి గుర్తు చేశాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశమిచ్చి 20ఏళ్లు అన్నంపెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణిని తిట్టానని ఇంటింటికి వెళ్లి గొప్పగా చెప్పుకోడానికి గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. మహిళలు, పెద్దలంటే వంశీకి గౌరవం లేదని, ఉంగుటూరులో గడప గడపకు కార్యక్రమం ప్రారంభించి స్థానిక జడ్పీటీసీకి కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. బాపులపాడులో ఆరుగురు కార్యకర్తల్ని సస్పెండ్ చేశారని, వైసీపీ కార్యకర్తల్ని సస్పెండ్ చేసే అధికారం వంశీకి ఎక్కడిదన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మాత్రమే పాటిస్తామని శివ భరత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: K. A. Paul: దాడి ఘటనపై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు!
మరోవైపు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దుట్టా, వంశీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన సమావేశం ఎటూ తేలకుండా ముగిసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో రెండుగంటల పాటు దుట్టా, వల్లభనేని వంశీలు చర్చించినా సమస్య కొలిక్కి రాలేదు. గన్నవరంలో జరుగుతున్న పరిణామాలను సజ్జలకు వివరించామని, వంశీతో కలిసి పనిచేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్లు దుట్టా రామచంద్రరావు తెలిపారు. వైఎస్సార్సీపీ పాత క్యాడర్‌ను వంశీ కలుపుకుపోవడం లేదని, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి అండగా ఉన్న వారిని వంశీ అణిచివేస్తున్నారని దుట్టా ఆరోపించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: APలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయ్.. నరకంలో ఉన్నట్టుగా ఉంది: KTR