ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహానీయుడు పొట్టి శ్రీరాములు జన్మించింది ఈ జిల్లాలోనే. రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ఇక కొత్త రాష్టం ఏర్పాటైన దగ్గర నుంచి నెల్లూరులో అధికార పార్టీ వైసీపీనే విజయం సాధిస్తూ వస్తోంది. నెల్లూరులోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వాసులు వైసీపీకి మద్దతుగా నిలిచి.. భారీ విజయం అందించారు. ప్రజల మద్దతు ఉన్నప్పటికి.. స్థానిక నేతల మధ్య ఇగోలు, గ్రూపు రాజకీయాలు, అసంతృప్తులు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారగా.. తాజాగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటుగా మారింది. ఈ క్రమంలో త్వరలోనే జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తనుందని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావమే చూపనుంది అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఒకసారి జిల్లాలోని నియోజకవర్గాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ఆత్మకూరు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇక్కడ వైసీపీ తరఫున మేకపాటి గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మృతితో నియోజకవర్గంలో వైసీపీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొనుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలతో సంబంధం లేకుండా.. మేకపాటి కుటుంబానికి ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టుంది. ఈ కుటుంబం నుంచి రాజకీయాల్లో ముగ్గురు వ్యక్తులు కీలకంగా ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, వైసీపీ తరఫున భారీ మెజారిటీతో పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇక వయసు మీదపడటంతో.. ఆయన ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో ప్రవేశించి.. తనదైన ముద్ర వేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మృతి నియోజకవర్గంలో వైసీపీకి తీరని లోటే అంటున్నారు విశ్లేషకులు.
ఉదయగిరి..
చాలా ఏళ్లుగా ఉదయగిరి నియోజకవర్గం కూడా మేకపాటి కుటుంబం ఖాతాలోనే ఉంది. కొన్నేళ్లుగా ఉదయగిరి నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్, వైసీపీ పార్టీల తరఫున విజయం సాధిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గంలో ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ లేదని సమాచారం.
కావలి..
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే జగన్ ప్రభావం వల్లనే ఆయన గెలిచారని.. వ్యక్తిగత ఇమేజ్ వల్ల కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆయన ప్రభావం కూడా చాలా తక్కువనే టాక్ వినిపిస్తోంది.
కోవూరు..
ఈ నియోజకవర్గంలో నల్లపరెడ్డి కుటుంబందే పైచేయి. గత ఎన్నికల్లో ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పార్టీల కన్నా నల్లపరెడ్డి కుటుంబం ఆధిపత్యమే ఎక్కువ. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక్క పార్టీలోనే స్థిరంగా ఉండే వ్యక్తి కాదు. ఏ పార్టీ నుంచి అవకాశం లభిస్తే.. దానిలో చేరతారు. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీల్లో చేరారు. కోవూరు నల్లపరెడ్డి కుటుంబానికి కేడర్ ఉంది కానీ.. పార్టీలకు కాదని రాజకీయ విశ్లేషకులు మాట. కనుక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిని నమ్ముకుని ఇక్కడ వైసీపీ ముందుకు వెళ్లడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.
నెల్లూరు రూరల్..
వైసీపీ తరఫున 2014, 2019లో ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అనే టాక్ వినిపిస్తోంది.
నెల్లూరు అర్బన్..
వైసీపీ తరఫున 2014, 2019లో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నారు ఈ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు.
వెంకటగిరి..
2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఆనం రామనారయణరెడ్డి విజయం సాధించారు. అయితే మొదటి నుంచి ఇక్కడ నేదురుమిల్లి, ఆనం కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. పైగా కొత్త జిల్లాల ఏర్పాటుతో అది మరింత ముదిరింది. ఆనం రామానారాయణ రెడ్డి త్వరలోనే పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నియోజక వర్గం కూడా వైసీపీకి తలనొప్పిగా మారింది అంటున్నారు విశ్లేషకులు.
సర్వేపల్లి..
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 2014, 2019 లో కాకాణి గోవర్ధనరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గం ఇదే అంటున్నారు కార్యకర్తలు.
సూళ్ళూరుపేట..
సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 2014, 2019 వైసీపీనే విజయం సాధించింది. రెండు సార్లు ఇక్కడ వైసీపీ తరఫున కిలివేటి సంజీవయ్య విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కూడా ఎలాంటి వివాదాలు, ఆధిపత్యపోరు లేకుండా ప్రశాంతంగా ఉందని కార్యకర్తలు అంటున్నారు.
ఈ రెండు నియోజకవర్గాలు మినహాయించి.. మిగతా చోట్ల ఆధిపత్య పోరు, బలమైన నాయకుడు లేకపోవడం, కేడర్ లేకపోవడం వంటి సమస్యలు ప్రస్తుతం వైసీపీని కలవరపెడుతున్నాయి. 2024 ఎన్నికల వరకు పరిస్థితి ఇలానే కొనసాగితే.. జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితులను చక్కదిద్దిందుకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అంటున్నారు నెల్లూరు వైసీపీ కార్యకర్తలు. జిల్లాలో నెలకొన్ని పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.