యుద్ధంలో గెలవాలంటే.. ముందుగా రాజును దెబ్బతీయాలి. దాంతో సైన్యం పరారవుతుంది. రాజకీయాలు అనే యుద్ధంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు కొందరు నాయకులు. వేర్లనే టార్గెట్ చేయాలి.. అప్పుడు చెట్టు దానంతట అదే కూలిపోతుందని భావిస్తారు. తన ప్రత్యర్థులు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు సీఎం సన్నిహితులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటి నుంచే క్యాడర్‌ని సిద్ధం చేస్తున్నారు జగన్. దానిలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో భేటీ కానున్నారు. అలానే ఈ సారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే టార్గెట్ అంటున్నారు జగన్.
మరీ ముఖ్యంగా ఓ ఐదుగురు నేతల ఓటమి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారట. మరి ఇంతకు ఆ ఐదుగురు నేతలు ఎవరు అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. మరీ ఈ ఐదుగురినే జగన్ ఎందుకు టార్గెట్ చేశాడు అంటే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా, విభజన తర్వత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అనూహ్య ఓటమి చవి చూసింది. టీడీపీ చరిత్రలోనే అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించింది. ఇంత భారీ స్థాయి ఓటమి టీడీపీ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఇక 2019 ఎన్నికల తర్వాత టీడీపీలో కీలక నేతలంతా గప్‌చుప్ అయినా.. చంద్రబాబు మాత్రం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో జగన్ టీడీపీకి ఆయువుపట్టు అయిన చంద్రబాబును టార్గెట్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఓటమే లక్ష్యంగా కుప్పంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కుప్పంలో టీడీపీ బలహీనం అవుతుండగా.. వైసీపీ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే.. ఇక టీడీపీ ఇప్పట్లో కోలుకోవడం అసాధ్యం. ఇక జగన్‌కు కావాల్సింది కూడా ఇదే కావడంతో.. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
లోకేష్..
చంద్రబాబు తర్వాత టీడీపీలో కీలక నేత లోకేష్. అన్ని బాగుండి.. అదృష్టం కలిసి వచ్చి.. ప్రజలు టీడీపీని గెలిపిస్తే.. చంద్రబాబు లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం లోకేష్ కూడా రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో ఎంతో కొంత నష్టం తప్పదు కనుక.. వచ్చే ఎన్నికల్లో మరోసారి లోకేష్‌ను ఓడించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అచ్చెన్నాయుడు..
ఇక టీడీపీలో పెదబాబు, చినబాబుల తర్వాత కీలక నేత అచ్చెన్నాయుడు. బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం చేత జగన్ ఈయనను టార్గెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అచ్చెన్నను ఓడించి.. ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా దూరం చేసి.. అచ్చెన్న వెంట ఉన్న బీసీ కాడర్‌ని వైసీపీలోకి ఆకర్షించడమే ప్రధాన టార్గెట్ అని.. అందుకే అచ్చెన్న ఓటమి కోసం కూడా వైసీపీ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
పవన్ కళ్యాణ్..
ఇక జగన్ మరో ప్రధానమైన టార్గెట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. జగన్ కూట్ర చేసి తనను ఓడించాడని పవన్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించాడు. అయితే ఏది ఎలా ఉన్నా సరే.. రానున్న ఎన్నికల్లో అసలు ప్రతిపక్షమే లేకుండా చూసుకోవాలనే టార్గెట్‌తో ముందుకెళ్తున్న జగన్.. పవన్ కళ్యాణ్‌ని కూడా టార్గెట్ చేశారు. ఇప్పటికే జనసేన.. ప్రజల్లోకి వెళ్లి.. ప్రభుత్వ పని తీరుపై విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ ధోరణి వల్ల ఎప్పటికైనా తనకు ప్రమాదమే అని భావిస్తున్న జగన్.. జనసేన దూకుడుకు కళ్లెం వేయాలంటే.. పవన్‌ని ఓడించడమే సరైన మార్గమని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రఘురామకృష్ణరాజు..
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరు గురించి అందరికి తెలుసు. సొంత పార్టీకే ఆయన పక్కలో బల్లెంగా తయారయ్యారు. తనను గెలిపించిన పార్టీ మీదనే అవకాశం దొరికిన ప్రతి సారి విమర్శలు చేస్తూ.. నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో రఘురామ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. వేరే పార్టీ నుంచి బరిలో దిగితే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామా ఏ పార్టీలో ఉన్న తమకు ఇబ్బందే కనుక.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించాలని జగన్ బలంగా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
పైన చెప్పుకున్న ఈ నేతలందరూ ఆయా పార్టీల్లో కీలక నేతలే కాకుండా.. ప్రజల్లో ఎంతో కొంత ఆదరణ ఉన్నవారే. అందువల్ల వీరిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా దూరం చేస్తే.. పార్టీల ఉనికి కూడా ఉండదని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ఈ నేతలకు ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో చూడాలి అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.