సీనియర్ తారక రామారావు శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజినీకాంత్ బాలకృష్ణ, చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబును తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. దీంతో జగన్ ఫ్యాన్స్ రజినీపై మండపడుతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ శుక్రవారం విజయవాడలో జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజినీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజినీ మాట్లాడుతూ బాలకృష్ణ, చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబును ఓ రేంజ్‌లో పొగిడేశారు. వేదిక మీద చంద్రబాబు నాయుడు ఉంటే.. రాజకీయాల గురించి తప్పకుండా ప్రస్తావించాలని రజినీ అన్నారు. విజన్ 2020 గురించి చంద్రబాబు 1996, 1997 టైమ్‌లోనే తనతో చెప్పారన్నారు. ఆ సమయంలోనే చంద్రబాబు ఐటీ ప్రాధాన్యతను గుర్తించారని వ్యాఖ్యానించారు. దానిలో భాగంగానే హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారని అన్నారు. నేడు లక్షల మంది తెలుగు ప్రజలు ఐటీలో పనిచేస్తూ లగ్జరీగా బతుకుతున్నారంటే అందుకు చంద్రబాబు నాయుడే కారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు దేవుడు చంద్రబాబుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ బాలకృష్ణతో పాటు చంద్రబాబు నాయుడ్ని పొగడటంపై వైఎస్ జగన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా రజినీపై ట్రోలింగ్స్ మొదలెట్టారు. రజినీకాంత్‌కు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సభకు వచ్చిన రజినీ.. ఎన్టీఆర్‌ను పొగడాల్సింది పోయి చంద్రబాబును పొగడ్డం బాలేదని అంటున్నారు. ఎంత మిత్రుడైనంత మాత్రాన ఏపీ రాజకీయాలను ఉద్ధేశించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.
రజినీకాంత్‌కు కేవలం చంద్రబాబు చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి మచ్చుకు మటుకు కూడా కనిపించటం లేదని అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు వచ్చారా? లేక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వచ్చారా? అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కామెంట్లు చేసే ముందు బాగా ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా రజినీపై ట్రోలింగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. మరి, వైఎస్ జగన్ అభిమానులు రజినీకాంత్‌పై ట్రోలింగ్స్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.