ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు ఆమెపై సీరియస్ గా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు ఆమె కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు క్రాస్ ఓటు వేయడం పట్ల వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని, డబ్బు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు సదరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ కార్యకర్తలు సీరియస్ గా ఉన్నారు. ఆమె కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి క్రాస్ ఓటు వేశారని గుంటూరులోని ఆమె కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. కార్యాలయం ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.