జనసేన పార్టీ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు కావొస్తుంది. అయినా గానీ పార్టీకి సంబంధించి అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇదిగో వీళ్ళే అని ఏరోజూ చెప్పలేదు. మిగతా పార్టీలను చూసుకుంటే.. టీడీపీ గానీ, వైసీపీ గానీ, బీజేపీ గానీ వాళ్ళ పార్టీలకంటూ అభ్యర్థులు ఉన్నారు. కానీ జనసేన విషయానికొస్తే అభ్యర్థులు లేరు. 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థులను అన్ని స్థానాల్లో నిలబెట్టలేదు. అప్పుడేవో లెక్కలు ఉన్నాయని పవన్ అన్నారు. ఇప్పుడు కూడా అభ్యర్థులను నిలబడతారో లేదో అన్న సందేహం నెలకొంటుంది. ఎన్నికలకు ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. ఉన్నది చాలా తక్కువ సమయం. అన్ని స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలి, ఆ అభ్యర్థులు క్యాడర్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ.
నిజానికి ఇప్పుడు రాబోయే ఎన్నికలు జనసేనకు, పవన్ కళ్యాణ్ కి చాలా కీలకం. ఈసారి గెలుపు గుర్రాలు లాంటి అభ్యర్థులను నిలబెట్టకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. పవన్ ఛరిష్మా పార్టీకి ఉన్నా.. లోకల్ గా నిలబడే అభ్యర్థి కూడా ప్రజల్లో బలమైన నాయకుడైతే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి గెలుపు గుర్రాలే జనసేనకి కరువు అయ్యారు.కానీ పవన్ మాత్రం ఇదేమి పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఎందుకంటే గెలుపు, ఓటములను తాను పట్టించుకోనని ముందే చెప్పారు. పవన్ పిలిస్తే ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు రాకుండా ఉంటారా? వాళ్ళు పోటీ చేస్తే గెలవకుండా ఉంటారా? మరీ దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం.. తన పార్టీలోకి రమ్మని ఎవరినీ ఆహ్వానించడం లేదు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి అసంతృప్త నేతలను పవన్ దగ్గర చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకపోవడానికి కారణం ఏమిటో అనేది అర్థం కావడం లేదు. వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీల్లోనే చాలా మంది నేతలు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సరైన రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రాజకీయ వేదికను పవన్ కళ్యాణ్ ఎందుకు కల్పించకూడదు? కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. గెలుపు కోసం ఒకరి దగ్గరకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించలేనని.. ఎవరికి వారు పార్టీ సిద్ధాంతాలు నచ్చి రావాలని గతంలో అన్న విషయం తెలిసిందే.
ఈ కారణంగానే బయట జనసేన పార్టీకి బలం చేకూర్చే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా పిలిచి చేర్చుకోవడం లేదు. ఆనం, కోటం రెడ్డి, గంట, రఘురామ కృష్ణం రాజు వంటి లీడర్లు ఉన్నా కానీ తాను నమ్మిన సిద్ధాంతానికి పవన్ కట్టుబడి ఉన్నారు. వచ్చి.. పోటీ చేసి పార్టీ మూసేసి వెళ్లిపోయేలా కాకుండా.. సుదీర్ఘ కాలం పాటు ఉండేలా పవన్ కళ్యాణ్ ఒక పక్కా ప్రణాళికతోనే వచ్చినట్లు పవన్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ రెండు టర్మ్ ఎన్నికలు అయ్యాయి. మూడో టర్మ్ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడైనా బరిలోకి దిగకపోతే పార్టీకి కష్టమని తెలిసినా పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
జనసేనకు కార్యకర్తలే బలం, వారే పార్టీ సంపద అని నమ్మే పవన్.. అభ్యర్థులు కూడా బలం అని ఎందుకు అనుకోవడం లేదు. గెలుపు, ఓటములతో సంబంధం లేదు అని చెప్పే పవన్.. పార్టీ పెట్టినందుకైనా గెలవాలి కదా. గెలిస్తేనే కదా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయగలిగేది అని బయట ప్రచారం జరగడం మామూలే. అయినా కానీ పవన్ తాను ఏదైతే అనుకున్నారో దానికి కట్టుబడి ఉంటూ వస్తున్నారు. ఒక పాతికేళ్ల పాటు నిలబడిపోవడానికి వచ్చానని గతంలో చెప్పారు. జెండా పాతితే ఎగరడమే తప్ప.. పక్కకు ఒరగడం ఉండకూడదనే కఠినమైన సిద్ధాంతం పవన్ ది. పాతిక కిలోల రైస్ బ్యాగ్ ఇవ్వను గానీ, పాతికేళ్ల భవిష్యత్తు మాత్రం ఇవ్వగలనని, తనకు వెంటనే సీఎం అయిపోవాలని లేదని, కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలని గతంలో పవన్ అన్నారు.
బహుశా ఈ కారణంగానే పవన్ పూర్తిగా అభ్యర్థులను నిలబెట్టడం లేదని అర్థం చేసుకోవాలా? దిగితే మెజారిటీ స్థానాలతో అధికారం కైవసం చేసుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే పవన్ మౌనంగా ఉంటున్నారేమోనని అనుకోవాలా? సరైన సమయం చూసి దిగేందుకు వ్యూహం రచిస్తున్నారనుకోవాలా? సరైన సమయం అంటే.. ప్రజలు పూర్తిగా తనవైపు నిలబడినప్పుడని అనుకోవచ్చా? తనవైపు నిలబడాలంటే తనకు తగ్గట్టు ట్యూన్ చేస్తున్నారని అనుకోవాలా? ఏమో ఇది సుదీర్ఘమైన వ్యూహమో? మౌనమో? తెలియదు గానీ ఓటమంటే మాత్రం భయం లేదని అర్థమవుతుంది. పవన్ ది ఏం కాన్ఫిడెన్సో అర్థం కావడం లేదు. ఓడిపోతానేమో అన్న భయం లేదు. ఇలాంటి రాజకీయం చేయాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. అది పవన్ లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి పవన్ ది వ్యూహమా? లేక మౌనమా? పవన్ ఆలోచన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.