గత కొంత కాలంగా ఏపిలో కరోనా పరిస్థితుల వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా వ్యాపార రంగాలపై పడింది. తాజాగా చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ లకు రూ. 440 కోట్ల ప్రోత్సాహకం, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కి రూ.684 కోట్లు పలు రకాలుగా చేయూతని అందించామని.. 25 నెలల్లో ఎంఎస్ఎంఈ లకు మొత్తం ప్రోత్సాహకాలు రూ.2,086 కోట్లు అందాయని సీఎం తెలిపారు. ఏ రాష్ట్రంలో అయినా పరిశ్రమల అభివృద్ది జరిగితేనే ప్రజలకు జీవనోపాధి లభిస్తుందని అన్నారు.
చిన్న పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని.. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గొప్పగా నిలబడుతుందని అన్నారు. గతంలో పరిశ్రమల విషయంలో హడావిడి ఎక్కువగా ఉండేదని.. కేవలం అగ్రిమెంట్ కాగితాల వరకే పరిమితం చేశారని.. ఏం జరక్క ముందే బుల్లెట్ ట్రైన్ వచ్చేసిందని చెప్పి గొప్పలకు పోయారని.. కానీ తమ ప్రభుత్వం అలా కాదని.. చెప్పిన మాటను చేసి చూపిస్తామని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం ఎంతో చిత్త శుద్దితో పనిచేస్తుందని.. అయితే కాయలు కాసేచెట్టుపైనే ఎక్కువ రాళ్లు వేస్తున్నారని.. కరోనా పరిస్థితుల్లోనూ ఎక్కడ సంక్షేమాన్ని ఆపలేదని.. నగదు బదిలీద్వారా ఆర్థిక వ్యవస్థ నిలబడిందని అన్నారు. మా ప్రభుత్వం 25 రకాల సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని.. సంక్షేమ పథకాలతో ప్రజలకు కొనుగోలు చేసే శక్తి పెరుగుతుందని అన్నారు.
సున్నపురాళ్ల పల్లిలో 13,500 కోట్ల రూపాయలతో వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దాని పనులుకు శ్రీకారం చుట్టామని.. మరో పదమూడు వేల కోట్ల రూపాయలతో 2024 నాటికి పూర్తి చేసేలా బావనపాడు, మచిలీపట్నం ఈ రెండూ కాక రామాయపట్నం మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇందులో రామాయపట్నం, బావనపాడు కి టెండర్లుకు కూడా పిలవడం జరిగిందని అన్నారు. మచిలీపట్నంలో టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఇవి కాకుండా రూ.3,800 కోట్ల రూపాయల వ్యకంతో రెండు దశల్లో 9 కొత్త ఫిషింగ్ హార్బర్ల అభివృద్ది కూడా చేస్తున్నామని అన్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లి మత్స్యకారులు పట్టుపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అలాంటి ఇబ్బందులను తొలగించడం కోసమే తొమ్మిది లొకేషన్లలో ఫిషింగ్ హార్బర్ల డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తున్నామని.. ఇప్పటికే నాలుగు చోట్ల టెండర్లకు పిలవడం.. పనులు మొదలు పెట్టించడం కూడా జరిగిందని.. మిగిలిన ఐదు లొకేషన్లలో టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. వీటి ద్వారా 76 వేల మంది మత్స్యకార సోదరులకు నేరుగా ఉపాధి అవకాశాలు లభ్యం అవుతాయని.. 2024 నాటి అనుబంధ పరిశ్రమల వల్ల పరోక్షంగా మరో 35 వేల మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని అన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి చిన్న పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా చూస్తే.. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మేలు చేయగలుగుతుందని సీఎం జగన్ అన్నారు. స్వయం ఉపాధిలో భాగంగా వైఎస్సార్ చేయూత, ఆసరా లాంటి కార్యక్రమాల ద్వారా పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కల్పించుకొని అక్కా చెల్లెల్లకు ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కాపాడుకునేందుక ప్రభుత్వ ఎంతగానో కృషి చేస్తుందని.. అప్పులు తెచ్చి అభివృద్దికి కృషి చేస్తుంటే మాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాభివృద్ది.. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం జగన్ తెలిపారు.