ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరుపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి శుక్రవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింహాచలం ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ధర్మకర్తలు ధర్మానికి కట్టుబడి సంప్రదాయాలు కొనసాగించాలన్నారు.
సింహాచలం ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయన్న మాట వాస్తవం అని మరోసారి విజయసాయి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆయన దర్శనం ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపింది. సింహాచలంలో విజయసాయిరెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ తెలుగుదేశం పార్టీ నిరసనకు దిగింది. ఈ విషయంలో సింహాచలం దేవస్థానం అధికారులు తీరును నిరసిస్తూ శనివారం సింహాచలం తొలి పావంచ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.
విజయసాయిరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి దేవస్థానం అధికారులు అపచారం చేశారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన ఈవో సూర్యకళను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేవస్థానాన్ని వెంటనే సంప్రోక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ చర్య హిందూ మనోభావాలని పూర్తిగా దెబ్బ తీసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారంలో ఉన్నంత మాత్రాన తమ ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. ఇక నేతలు చెప్పినట్లు అధికారులు చేస్తున్నారని ఆరోపించారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.