మనుషుల ఎమోషన్స్‌ని వాడుకోవడం.. వాటిని క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ నేత వల్లభనేని వంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రైవేట్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వల్లభనేని పలు అంశాలపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీ కోసం పనిచేయించుకొని.. ఆ తర్వాత దూరం పెట్టారని వంశీ ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానితో తనకున్న అనుబంధం, సీనియర్ ఎన్టీఆర్‌పై అభిమానం, 1995 టీడీపీ సంక్షోభం తదితర అంశాలపై వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘లక్ష్మీపార్వతి చేతుల్లోంచి పార్టీని కాపాడేందుకే.. ఆనాడు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, మంచి కోసం అందరం కలిసి పనిచేశామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత కొద్ది కాలానికే అందరిని ఎందుకు దూరం పెట్టారని’’ వంశీ ప్రశ్నించారు.
‘‘కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్.. నేను.. మేమంతా ఒక బృందంగా ఉండేవాళ్లం. సీనియర్ రామారావు గారి అభిమానులం కావడం.. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండటంతో మేమంతా కలిసి ఉండేవాళ్లం. మా మధ్య మంచి స్నేహం ఉండేది. ప్రస్తుతం జూనియర్ సినిమాలకు పరిమితం అయ్యారు. మేం రాజకీయాల్లో బిజీగా ఉన్నాం. మా రాజకీయ కెరీర్‌లో ఆయన ప్రమేయం గానీ, ఆయన సినిమా కెరీర్‌లో మా ప్రమేయం గానీ లేవు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా, సానుభూతిపరులుగా ఉన్నాం. తరచూ కలవడాలు, ఫంక్షన్లకు వెళ్లడాలు లాంటివి లేవు’’ అని చెప్పుకొచ్చారు వల్లభనేని వంశీ.
‘‘2009 ఎన్నికల సమయానికి ఎన్టీఆర్ చాలా చిన్నపిల్లవాడు. అప్పటికి అతనికి కేవలం పాతికేళ్ల వయసు. కానీ అప్పటికే ఆయనకు ఇండస్ట్రీలో ఆల్‌మోస్ట్ చిరంజీవితో సమానమైన క్రేజ్ ఉంది. అలాంటి ఎన్టీఆర్‌ను.. ఆయన కెరీర్‌ను ఫణంగా పెట్టి మరి టీడీపీ కోసం ప్రచారం చేయించుకున్నారు. నాటి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ కూడా జరిగింది. కానీ జూనియర్ అదృష్టం బాగుండటం.. సీనియర్ రామారావు గారి ఆశీస్సులు ఉండటం వల్ల ఆయన బతికి బయటపడ్డారు’ అంటూ నాటి ఘటనను గుర్తు చేశారు వంశీ.
ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌పై పత్రికల్లో తప్పుడు రాతలు రాయించారని వంశీ ఆరోపించారు. ‘ఎన్నికల వేళ.. ఎన్టీఆర్ వెళ్లిన మార్గాలు ఇవీ అంటూ.. ఏయే ఊర్లు వెళ్లాడు అని గీతలు గీసి, ఆ ఊర్లన్నింటిలో టీడీపీ ఓడిపోయిందని పత్రికల్లో వార్తలు రాశారు. అంటే, పార్టీకి జూనియర్ పనికిరాడని చంద్రబాబు ఇన్‌డైరెక్ట్‌గా వార్తలు రాయించాడు. ఈ వార్తలన్ని ‘ఈనాడు’లోనే వచ్చాయి. దీంట్లో దాపరికం లేదు, చరిత్రను ఎవరు మార్చలేరు. ఎన్నికల తర్వాత జూనియర్‌ని అంత దారుణంగా అవమానించారు’ అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు.
‘‘2014లో చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో.. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను కనీసం పిలిచారో, లేదో.. కూడా అందరికీ తెలుసు. నాకు సీటు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎన్టీఆర్‌తో మాట్లాడకూడదు అంటూ చంద్రబాబు నాయుడు ఒట్టు వేయించుకున్నాడు. ఎన్టీఆర్‌తో తనకు ఇబ్బంది ఉందని చెప్పాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను పిలిచారా.. కనీసం దీని గురించి ఎవరైనా పట్టించుకున్నారా’’ అని వంశీ ప్రశ్నించాడు.
ఎన్టీఆర్‌తో అవసరం తీర్చుకొని ఇప్పుడు దూరం పెట్టారు అని ఆరోపించాడు వంశీ. ‘ఇప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఎన్టీఆర్ స్పందించాలి.. ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వాలి అని గోల చేస్తారు. హ్యూమన్ ఎమోషన్స్‌ను క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎక్కడైనా చూడండి.. రెండు కులాల మధ్యో, మతాల మధ్యో తగాదా పెట్టడం.. ఎమోషన్స్‌ను రగల్చడంలో చంద్రబాబు దిట్ట’ అంటూ వంశీ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.