ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యి దేశానికి సేవ చేయాలని చాలా మంది యువతీ యువకులు కలలుకంటారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతుంటారు. అంత కష్టపడి చదువుతున్న వీరిపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఉత్తమ సేవల విభాగంలో ముందు వరుసల్లో నిలుస్తారు ఐఏఎస్, ఐపీఎస్‌లు. అనేక మంది యువతీ యువకులు తాము ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యి దేశానికి సేవ చేయాలని కలలుకంటారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతుంటారు. వెంటనే విజయం వరిస్తుందనుకోవడం పొరపాటు. ఒకసారి సివిల్స్ సర్వీసు పోయినా.. మరోసారి రాస్తుంటారు. యుపిఎస్సీ పరీక్షలు రాసి, మంచి స్కోర్ సాధిస్తేనే ఈ రెండింటిలో వెళ్లగలం. తీరా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారాక.. వీరికొచ్చే గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు వేరే లెవల్ ఉంటుంది. అంత కష్టపడి చదువుకుని అధికారులైన వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారో కేంద్ర మంత్రి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా నియమించబడిన అధికారుల్లో చాలా మంది దొంగలే ఉన్నారని బిజెపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగ కోళ్లను పట్టుకెళ్లే వాడికైనా శిక్ష పడుతుందీ కానీ, మినరల్ మాఫియాకు పాల్పడుతున్న అధికారిని శిక్షించలేమని అన్నారు. వ్యవస్థలన్నీ ఆయనను కాపాడుకుంటూ వస్తాయని వ్యాఖ్యానించారు. ‘యుపీఎస్సీ చదువుకుని వచ్చిన వారంతా ..అత్యంత జ్ఞానం గల వ్యక్తులని, ఎల్లప్పుడూ ఉన్నత భావాలతో ఉంటారని ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి అర్హత సాధించిన వారిలో చాలా మంది దొంగలే. నేను 100 శాతం మంది ఇలానే ఉన్నారు అని చెప్పను కానీ.. వారిలో చాలా మంది చోరులే’అని తుడు వ్యాఖ్యానించారు.
మన విద్యావిధానంలో నైతికత లేకపోవడమే కారణమంటూ వ్యాఖ్యానించారు ఈ ఒడిశా ఎంపీ. ఎందుకు వీరు అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రశ్నించారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే వారి గురించి చెప్పే ముందు రాజకీయ నేతలు కూడా చెబితే బాగుంటుందని కొందరు అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లలో అందరూ దొంగలు ఉండరని, కానీ మీ నేతల్లో ప్రతి ఒక్కరూ రూపాయి ఖర్చుపెట్టకుండా నీతిగా, నిజాయితీగా ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్లను చూపించండని ప్రశ్నిస్తున్నారు. అలాగే అటు అధికారులతో పాటు రాజకీయ నేతలు ఇద్దరూ తోడు దొంగలేనని కౌంటర్లు వస్తున్నాయి.