అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ప్రెస్ మీట్ లో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారు. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న కారణంగా వైసీపీ హైకమాండ్ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. సస్పెన్షన్ తర్వాత తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. పార్టీలో తనను టార్గెట్ చేశారని.. కావాలనే తనపై బురద జల్లుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది వైసీపీ గుండాలు రకరకాలుగా వేధిస్తూ.. సోషల్ మీడియాలో తనపై చెత్త పోస్టులు పెడుతున్నారని ఆవేదన చెందారు. మహిళా శాసన సభ్యురాలు అని చూడకుండా వారు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. తన పార్టీ కార్యాలయంపై గూండాల్లా దాడి చేశారని మండిపడ్డారు.
తాను గెలిచినప్పటి నుంచి తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. సీక్రెట్ ఓటింగ్ లో తాను ఎవరికి ఓటు వేశానన్న విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు. 22వ ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే లేరా? విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లేరా? కాకినాడ నుంచి వచ్చిన అసంతృప్త ఎమ్మెల్యే లేరా? అని ఆమె ప్రశ్నించారు. తాను డాక్టర్ నని, తన భర్త డాక్టర్ అని.. తమకు రెండు ఆసుపత్రులు ఉన్నాయని.. డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు ఎందుకు ఉంటుందని అన్నారు. డబ్బులు తీసుకుని క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది చేసే అవినీతి పనులకు తాను అడ్డు వస్తున్నందుకే ఇలా తనపై కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెక్కడికి వెళ్లిపోలేదని.. పని మీద హైదరాబాద్ వచ్చానని.. హైదరాబాద్ ఏమైనా సహారా ఎడారా? లేక దుబాయ్ అండర్ గ్రౌండా? అంటూ ప్రశ్నించారు. తనకు ప్రాణ హాని ఉందని, ఏపీకి రావాలంటేనే భయం వేస్తుందని అన్నారు. డబ్బులు తీసుకున్నా అని నిరూపించండి అని అన్నారు. ఏపీలో ఒక్క ఎమ్మెల్యేకి కూడా రక్షణ లేదని.. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. మరి ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.