రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార, విపక్షాలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఏపీలో జనసేన-టీడీపీ మధ్య పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. స్వయంగా జనసేనానినే గౌరవప్రదంగా ఉంటే పొత్తుకు ఓకే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి.. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది కదా.. మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ పొత్తుపొడుపులు ఆంధ్రప్రదేశ్‌లో కాదు.. తెలంగాణలో. ఇప్పటికే రాష్ట్రంలో దూకుడుగా వెళ్తోన్న బీజేపీ.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బలం పెంచుకునే దిశగా తీవ్రంగా కృషి చేస్తోంది.
బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా మోదీ, అమిత్ షాలు రాష్ట్రంలో అనేకమార్లు పర్యటించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో.. బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే దిశగా బీజేపీ ప్రయాత్నలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో టీడీపీతో పొత్తుపై ఆలోచనలు చేస్తోంది బీజేపీ. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై ఆలోచిస్తునామని.. తరుణ్ చుగ్ తెలిపాడు.
ప్రస్తుతం తెలంగాణలో.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తరుణ్ చుగ్ వెల్లడించాడు. దీనిలో భాగంగా.. ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 11 వేల సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం.. 12 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపాడు. అలానే చేరికలను వేగవంతం చేయాలని అధిష్టానం భావిస్తోంది.. రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది బీజేపీలో చేరతారని తెలిపారు. అలానే షర్మిలకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. మరి తరుణ్ చుగ్ చెప్పినట్లు.. బీజేపీ-టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.