మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లతో ఈ ఎన్నికల్లో విజయ భేరీ మోగించారు. బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లు సాధించగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 85,128 ఓట్లు సాధించారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి 3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు.. తర్వాతి మూడు రౌండ్లలో నారాయణపురం మండలం ఓట్లు..
తర్వాతి రెండు రౌండ్లలో మునుగోడు మండలం ఓట్లు.. 9,10 చండూరు.. 11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలా ఓట్లు లెక్కించారు. మొదటి నాలుగు రౌండ్ల వరకు టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటాపోటీ నడిచింది. ఆ తర్వాత ఆరవ రౌండ్‌నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీ సాధిస్తూనే వచ్చారు. మొత్తం 15 రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థే ఎక్కువ సార్లు తన ఆధిక్యతను ప్రదర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 23 వేల ఓట్లకు మాత్రమే పరిమితం అయింది.
నైతిక విజయం నాదే : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోవటంపై బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కుటుంబపాలనకు వ్యతిరేకంగా.. కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా.. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయవచ్చని నమ్మి, మునుగోడు ప్రజల బాగుకోసం రాజీనామా చేశాను. మునుగోడు ప్రజలు కూడా నా నిర్ణయాన్ని సమర్థించారు. అందుకే బీజేపీలో చేరాను.
మనుగోడు ప్రజలు నాకు మంచిగా ఓట్లు వేశారు. నేను నైతికంగా గెలిచాను. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మునుగోడులో ఎప్పుడైతే అరచకాలు మొదలుపెట్టారో అప్పుడే నేను గెలిచాను. మునుగోడు ప్రజలు గెలిచారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడింది. పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. కేసీఆర్‌కు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు. ఏది ఏమైనా నైతిక విజయం నాదే. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నా పోరాటం ఆగదు’’ అని అన్నారు.