పుష్ప 2 అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపిస్తారు. ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే లుక్ లో తాజాగా వైసీపీ ఎంపీ సందడి చేశారు.
పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుక్, హావభావాలు, నటన, యాటిట్యూడ్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తగ్గేదేలే అన్నట్టు ఉంటాయి. పుష్ప సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కూడా ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగానే ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సన్నివేశంలో అల్లు అర్జున్ గెటప్ మాత్రం హైలైట్ అసలు. చీర కట్టుకుని, చేతులకు గాజులు తొడుక్కుని అమ్మవారిలా ముస్తాబైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఆ మధ్య విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ లుక్ చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ గెటప్ ను చాలా మంది వేసుకుని వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ కూడా ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ గెటప్ ను వేసుకున్నారు.
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ జాతర మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మాతంగి మాత వేషం ధరించి.. పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ జాతరలో ఒక్కో రోజు ఒక్కో వేషంలో భక్తులు దర్శించుకుంటారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరవ రోజు గంగమ్మ భక్తి చైతన్య యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. పుష్ప 2లోని అల్లు అర్జున్ వేషధారణలో కనబడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పుష్ప 2 లో అల్లు అర్జున్ మాతంగి మాత వేషధారణలో కనిపిస్తారు. ఈ గెటప్ లోనే వైసీపీ ఎంపీ గురుమూర్తి గంగమ్మ జాతరలో సందడి చేశారు.
మాతంగి మాత వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, తిరుపతి నగర ప్రజలు ఉత్సాహం చూపించారు. అనంత వీధి నుంచి గంగమ్మ ఆలయం వరకూ డప్పులు, మంగళవాయిద్యాల మధ్య నడుచుకుంటూ వెళ్లి గంగమ్మ వారిని దర్శించుకున్నారు ఎంపీ గురుమూర్తి. ప్రస్తుతం మాతంగి మాత వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గత ఏడాది గంగమ్మ జాతర సందర్భంగా ఎంపీ గురుమూర్తి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరస్వామి వేషధారణలో కనిపించి సందడి చేశారు. మరి మాతంగి మాత వేషధారణలో గంగమ్మ జాతరలో పాల్గొన్న ఎంపీ గురుమూర్తిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.