గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ప్రభుత్వం, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు క్షపాణలు చెప్పాలంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన చంద్రబాబు ఇంటి ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. అప్పిటికే చంద్రబాబును కలవడానికి అక్కడికి వచ్చిన బుద్ధా వెంకన్న, గద్దె రామ్మెహన్ మరి కొంతమంది తెదేపా కార్యకర్తలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పరం దాడులు జరిగాయి. పోలీసులు బ్యారికేడ్లతో ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
చంద్రబాబు ఇంటి సమీపంలోకి చేరుకున్నన ఎమ్మెల్యే జోగి రమేష్, వైకాపా కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న తెదేపా కార్యకర్తలు, బుద్ధా వెంకన్న అడ్డుపడ్డారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. జెండా కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. వైకాపా కార్యకర్తలు తమపై రాళ్లు రువ్వారంటూ తెదేపా నేతలు ఆరోపించారు. తెదేపా కార్యకర్తలు తన కారు అద్దాలు ధ్వంసం చేశారంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. బుద్ధా వెంకన్న అస్వస్థతకు గురైనట్లు, సొమ్మసిల్లి పడిపోయినట్లు తెదేపా కార్యకర్తలు తెలిపారు. మరో కార్యకర్త తలకు గాయమైనట్లు చెప్పారు.
జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటికే రక్షణ లేకపోతే ఇక, రాష్ట్రంలో సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ముందస్తు పిలుపు లేకుండా ఇలా ఇంటి ముట్టికి రావడం రౌడీయిజమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటూ బుద్ధా వెంకన్న తెలిపారు. మరోవైపు తెదేపా నేత గద్దె రామ్మోహన్ పోలీసుల తీరును తప్పుబట్టారు. పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతోందని.. కావాలనే చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా కాపాడుకోలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని గద్దె రామ్మోహన్ తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు ఇంటి ముట్టడికి యత్నించిన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే బయట తిరగనివ్వం అంటూ హెచ్చరించారు. తెదేపా నేతలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు కావాలనే నాపే రాళ్లు వేయించారంటూ జోగి రమేష్ ఆరోపించారు. తెదేపా కార్యకర్తలు తన కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై తెదేపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు.
అష్టకష్టాలు పడి పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలను చెదరగొట్టి కట్టడి చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.