క్యూన్యూస్ చానెల్ ద్వారా.. బీఆర్‌ఎస్, కేసీఆర్‌లపై నిప్పులు చెరుగుతాడు తీన్మార్ మల్లన్న. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్, కవితలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జైలుకు కూడా వెళ్లాడు. బెయిల్ మీద బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. వరుసగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ గట్టిగా కృషి చేస్తోంది. మరోవైపు బీజేపీ.. తన బలాన్ని పెంచుకుని.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం తామే అనిపించుకోవాలని ఆరాటపడుతోంది. అటు చూస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద పోరాటం చేసే విషయం పక్కకు పెట్టి.. తమలో తాము కొట్టుకుంటున్నారు నేతలు. మరోవైపు వైఎస్ షర్మిల కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని.. శక్తి వంచన లేకుండా పోరాడుతోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలకు తోడు.. మరో కొత్త పార్టీ రానుంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రకటించారు. ఆ వివరాలు..
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల చేశారనే ఆరోపణలతో జైలుకు వెళ్లిన తీన్మార్ మల్లన్న మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనతో పాటు క్యూ న్యూస్ సిబ్బందికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో అందరూ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. మల్లన్న విడుదల సందర్భంగా ఆయన అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తాను తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు తెలిపాడు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశాడు. సీఎం కేసీఆర్ గద్దె దించడమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం ఉండబోతుందని వెల్లడించారు. ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించానని తెలిపాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్ముకుంటే.. తాను వీకర్ సెక్షన్ నమ్ముకుని ముందుకు సాగిబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. జైలుకు పంపితే తాను భయపడనని.. జైలు తనకేమీ కొత్త కాదని.. కేసీఆర్ కుటుంబానికే కొత్త అని తెలిపాడు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే స్థానంపై కూడా మల్లన్న క్లారిటీ ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి మల్లారెడ్డి కొనసాగుతున్నాడు. మరి తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.