2024 ఎన్నికల్లో టీడీపీ జోరు ఖాయమా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలుబడ్డాయి. 14 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా.. తొమ్మిది స్థానిక సంస్థ స్థానాల్లో, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార వైసీపీ పార్టీ విజయం సాధించింది. మిగిలిన మూడు పట్టభద్రుల స్థానాల్లో ప్రతిపక్షం టీడీపీ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. టీడీపీ గెలిచింది మూడు స్థానాలైనా అధికార పార్టీకి మాత్రం ఇది ఊహించని షాకే. ఎందుకంటే టీడీపీ విజయం సాధించింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో.. ఈ ఫలితాలను అధికార వైసీపీ ఊహించలేదు. సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమదే విజయం అని ఊహిస్తూ వచ్చిన అధికార పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బ. ఈ ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టీడీపీ గెలిచింది మూడు స్థానాలు అయినా అక్కడ ఓట్లు వేసింది పట్టభద్రులు. అనగా యువత, నిరుద్యోగులు. వీరంతా టీడీపీకి పట్టం కట్టడం ఊహించని పరిణామం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో యువత టీడీపీకి పట్టం కట్టడం.. ఆ పార్టీ మూడు చోట్ల విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది. దాంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఉద్దేశించి తీసుకొచ్చింది. వీటితో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఈ విషయం అంగీకరించదగినదే.
అయితే సంక్షేమం మాత్రమే సరిపోదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కావాలి. ఈ విషయంలో అధికార పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నట్లు ఈ ఫలితాలతో అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యువత ముఖ్యంగా కోరుకునేది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. అయితే వైసీపీ నాయకులు అధికారంలోకి రావడానికి ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము.. ఖాళీలను భర్తీ చేస్తాము అని చెప్పినప్పటికీ.. ఆ దిశగా పెద్దగా అడుగులు వేయలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే విపక్షాలు సైతం వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు రాలేదు.. వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లాయంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇవన్నీ యువత దృష్టిలో బలంగా నాటుకుపోయాయి. ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణమైంది అంటున్నారు విశ్లేషకులు.
ప్రభుత్వ ఏర్పాటులో యువత కీలకపాత్ర పోషిస్తుంది. అటువంటిది తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాలు గెలవడంతో అధికార పార్టీపై యువతలో ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మూడు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే సుమారు 100కు పైగా మండలాల నుంచి ఓటర్లు అనగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే లక్షల్లో ఓట్లు పోలయ్యాయి. వీరంతా కేవలం యువతే. అధికార పార్టీకి కీలకమైన ఇలాంటి స్థానాల్లో యువత విపక్షాలకు పట్టం కట్టడం అనూహ్య పరిణామం అంటున్నారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా యువత ఆలోచన విధానం ఇలాగే ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఆధిక్యం రావడం, అధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ సైతం యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల వరకు లోకేష్ ప్రజల్లోనే ఉంటారు. ఆయన పాదయాత్ర ప్రధాన లక్ష్యం యువత సమస్యలపై పోరాటం, ప్రభుత్వ వైఫల్యాలను యువత దృష్టికి చేరవేయడం. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే లోకేష్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది పాటు తమ యువ నేత ప్రజల్లోనే ఉంటారు కాబట్టి యువత టీడీపీ వైపు మొగ్గు చూపడం ఖాయం.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టడం ఖాయమని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ ఫలితాలు మాత్రం ఒకటి స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమం మాత్రమే సరిపోదు, దాంతో పాటు యువతకు ప్రధానమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అలా కాకుండా కేవలం సంక్షేమం మీదనే ఆధారపడితే రానున్న ఎన్నికల్లో ఇదే ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల కోసం విశాఖలో సమ్మిట్ నిర్వహించినప్పటికీ దానిపై యువతకు పెద్దగా నమ్మకం కలగలేదు. ఎందుకంటే అవన్నీ పేపర్లకే పరిమితం అవుతాయి ఆచరణలోకి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు యువతపై ప్రభావం చూపాయి. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉంది. ఈ తరుణంలో టీడీపీ గనుక యువత మీద మరింత కాన్సంట్రేషన్ చేస్తే టీడీపీ హవా ఖాయం.. ఎమ్మెల్సీ ఫలితాలు అదే నిరూపించాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఎమ్మెల్సీ ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.