పాదయాత్ర.. రాజకీయాల్లో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జనంతో మమేకమవుతూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. సమస్యలు వింటూ.. పరిష్కారాల గురించి హమీ ఇస్తూ.. ముందుకు సాగుతారు నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా సుదీర్ఘ పాదయాత్రలు చేపట్టి.. అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాద యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు కూడా పాదయాత్ర చేశారు. రాజకీయాల్లో పాదయాత్రకు అంతటి ప్రాముఖ్యత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే.. టీడీపీ నేత లోకేష్ త్వరలోనే ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. ఆ వివరాలు..
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు యువగళం అని పేరు ఖరారు చేశారు. ఇక జనవరి 27న పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే తండ్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం నుంచే లోకేష్.. యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. పాదయాత్రకు సంబంధించిన లోగో, పేరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు కొన్ని రోజుల కిందటే ఆవిష్కరించారు. కుప్పం నుంచి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్ర.. సుమారు 400 రోజులు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 నియోజకవర్గాల్లో.. 4వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది.
యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమవుతుందని టీడీపీ నేతలు తెలిపారు. అయితే ఈ పాదయాత్రలో ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యువతతో పాటూ మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ పాదయాత్ర ముందుకు సాగుతుంది అంటున్నారు టీడీపీ నేతలు. అలానే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొనవచ్చని.. దీనికి గాను.. 96862 96862కు మిస్ట్ కాల్ ఇవ్వడం, yuvagalam.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ద్వారా.. పాదయాత్రలో పాల్గొనవచ్చని తెలిపారు.
లోకేష్ చేపట్టనున్న ఈ సుదీర్ఘ పాదయాత్రలో.. అన్ని రంగాల సమస్యల్ని అధ్యయనం చేయడంతో పాటూ.. రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి యువతను ఆహ్వానిస్తున్నామని టీడీపీ నేతలు పేర్కొన్నారు. యువతతో సహా అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం అవుతుండగా.. ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురంలో ముగియనుంది. మరి లోకేష్ పాదయాత్ర ద్వారా టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.