తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వారి పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యల గురించి అడిగితెలుసుకున్నారు. తర్వాత పాలకొల్లు నియోజకవర్గం దొడ్డిపట్లలో ముంపు బాధితులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
ముంపు బాధితులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చంద్రబాబు సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు బురదలో ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఆకాశంలో విహరిస్తున్నారన్నారు. గాల్లో తిరిగితే సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ప్రశ్నించారు. ప్రజలు సకాలంలో స్పందించి ఇసుక బస్తాలు వేయకపోతే ఇంక పెద్దఎత్తున నష్టం వాటిల్లేదని అభిప్రాయపడ్డారు.
“గతంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా నేను క్షేత్రస్థాయిలో ఉండి అధికారులకు సూచనలు చేసే వాడిని. ప్రజలకు అండగా ఉండాల్సిన జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు. ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసే పార్టీ తెలుగుదేశం. పోలవరం పూర్తయి ఉంటే ఈ స్థాయిలో వరదలు వచ్చేవి కావు” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సొంత నియోజకవర్గానికి కూడా రానివ్వడం లేదంటూ విమర్శించారు. బాబాయ్‌ని చంపి ఆ నేరం తనపై నెట్టాలని చూశారంటూ ఆరోపించారు. అలాగే ఎంపీ రఘురామపై కూడా హత్యాయత్నం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నేరాన్ని మరెవరిపైనో నెట్టేయాలని చూశారన్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.