ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇది ఎవరికైనా సంజీవని లాంటి మాట. అధినేతలు సైతం ఇందుకు అతీతం కాదు. ఓ రాష్ట్రాన్ని ముందుకి నడపాలంటే దానికి శారీరకంగా, మానసికంగా చాలా శక్తి ఉండాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయంలో మంచి అవగహన కలిగి ఉంటారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఆయన చాలా ఫిట్ గా, స్లిమ్ గా ఉంటారు. రోజు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందించడమే దీనికి కారణం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.., ఇప్పుడు అధికారంలో ఉన్నా స్టాలిన్ ఒక్క రోజు కూడా వర్కౌట్స్ చేయకుండా ఉండరట. ఆయన ఇంటిలో దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి పెట్టుకున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ సమక్షంలోనే స్టాలిన్ జిమ్ చేస్తుంటారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకి వచ్చింది. ఈ వీడియోలో తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా సెటిల్డ్ గా వర్కౌట్స్ చేస్తుంటే.., పక్కనే ఉన్న ట్రైనర్ ఆయనకి సూచనలు ఇస్తున్నాడు. కొన్ని సెకన్స్ మాత్రమే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టాలిన్ సీఎం అయ్యాక ఆయన పరిపాలన విధానానికి మంచి పేరు వచ్చింది. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేయడం, పేదల ఆకలి తీర్చే ప్రభుత్వ క్యాంటిన్లను అదే పేరుతో కొనసాగించడం, ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నాయకులకి సైతం స్థానం కల్పించడం వంటి కార్యక్రమాలు ఆయనకి మంచి పేరు తెచ్చి పెట్టాయి.