తెలంగాణలో ఇప్పుడు పాదయాత్ర రాజకీయాలు జోరందుకోబోతున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నేటి తరం రాజకీయ నాయకులు పాదయాత్ర మంత్రాన్ని వాడుకోబోతున్నారు. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంత భాగంలో పర్యటించారు. అప్పట్లో ఈ పాదయాత్ర రాజకీయంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నరాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. దీంతో పలు మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయటం విశేషం.
ఇక తెలంగాణ రాజకీయాల్లో రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వైస్ షర్మిల. అడుగు పెట్టడమే కాకుండా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలోని ప్రజా సమస్యలపై స్పందిస్తూ తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇక తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణలో పాదయాత్ర చేయనున్నానని తెలిపింది. ఎన్నో రోజుల నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పిన షర్మిల నేటి మీడియా సమావేశంలో దీనిపై కొంత క్లారిటీ మాత్రం ఇచ్చారు.
ఇక తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణలోని చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. దీంతో తన తండ్రి బాటలోనే నడవాలని భావించిన షర్మిల తాను కూడా చేవెళ్ల నుంచే ప్రారంభిస్తానని క్లారిటీ ఇచ్చింది. తన పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తా రాసి పెట్టుకొండి అంటూ ధీమా వ్యక్తం చేసింది. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెలిపింది షర్మిల. ఇక వచ్చే నెలలో తేలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించి విషయం తెలిసిందే.