టీపీసీసీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీజీ అనే పదాన్ని కనుమరుగు చేసి టీఆర్ఎస్ పార్టీ పదాలను అనుకూలించేలా టీఎస్ అనే పదాన్ని తీసుకొచ్చారని కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ని టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఎస్ కి బదులు టీజీ అనే రాసుకోవాలని సూచించారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రను వక్రీకరించి టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకున్నారు కాబట్టి.. దాన్ని సవరించే బాధ్యతను వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్న ఆలోచన చేస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఆర్ఎస్ కు పర్యాయపదంగా కేసీఆర్ ‘టీఎస్’ ను పెట్టారని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్ కాకుండా టీజీ అనే ఉండాలని తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు సూచించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ప్రజలు ఆమోదం తెలిపితే.. తాము అధికారంలోకి రాగానే మొదటి ప్రతిపాదనగా టీఎస్ ను టీజీగా మారుస్తామని అన్నారు. రెండవ ప్రతిపాదనగా తెలంగాణ రాష్ట్ర గీతంగా.. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను ప్రకటిస్తామని అన్నారు.
అలానే మూడవ ప్రతిపాదనగా.. సబ్బండ వర్గాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. నాల్గవ ప్రతిపాదనగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన జెండాను తీసుకొస్తామని అన్నారు. సెప్టెంబర్ 17 2022 నుంచి సెప్టెంబర్ 17 2023 వరకూ ఈ అన్ని అంశాలను మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.