కాంగ్రెస్ లో ఎప్పుడు.., ఎవరికి పదవులు దక్కుతాయో, ఎవరికి ప్రాధాన్యత దక్కదో చెప్పడం చాలా కష్టం. ముప్పై ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు, నిన్న కాక మొన్న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఒకవైపు. కానీ.., కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంచింది. తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠాన్ని రేవంత్ రెడ్డిని వరించింది. కాంగ్రెస్ లో పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఇలానే ఉంటాయి. రేవంత్ రెడ్డి ఛరీష్మా ఉన్న నేత. గత కొన్ని ఏళ్లుగా కేసీఆర్ తో వన్ టూ వన్ పొలిటికల్ ఫైట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. అయినా.. వాయిస్ లో బేస్ మాత్రం తగ్గించలేదు. ఇవన్నీ కూడా రేవంత్ కి తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ దక్కడానికి కారణాలు అయి ఉండవచ్చు. కానీ.., ఇప్పుడు రేవంత్ రెడ్డిపై చాలానే బాధ్యతలు ఉన్నాయి. మరి ఈక్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ దశ మార్చగలడా అంటే చాలానే అడ్డంకులు కనిపిస్తున్నాయి.
ఏపీలో పార్టీని చేజేతులా నాశనం చేసుకుని మరీ.. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణకి అంగీకారం తెలిపింది. కానీ.., ఈ విషయంలో కేసీఆర్ తో సమానంగా క్రెడిట్ సాధించడంలో అప్పటి కాంగ్రెస్ నేతలు విఫలం అయ్యారు. ఇక్కడ నుండే తెలంగాణలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. అలా కేసీఆర్ ని ఢీ కొట్టకలిగే స్థాయి లీడర్ కాంగ్రెస్ లో లేకుండా పోయాడు. ఇప్పుడు ఆ ఖాళీని రేవంత్ భర్తీ చేయగలగాలి.
నిన్న మొన్నటి వరకు కేసీఆర్ పై రేవంత్ సాగించిన పొలిటికల్ వార్ లో ఆయనకి బీజేపీ మద్దతు ఉంటూ వచ్చింది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి.., రేవంత్ కమలం పార్టీపై కూడా ఫోకస్ పెట్టి పని చేయక తప్పదు.
ఇక కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్మలాటని అణచి.., సీనియర్స్ అందరిని రేవంత్ ఒక తాటిపైకి తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంత కొంత మంది సీనియర్స్ రేవంత్ నియామకాన్ని తప్పు పడుతున్నారు. సో.. ఈవిషయంలో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారు అన్నది కీలకంగా మారింది.
రేవంత్ రెడ్డి మీద ఇప్పటికే ఓటుకి నోటు కేసు ఉంది. ఈ సమయంలో రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాబట్టి.., రేవంత్ స్పీడ్ చూపించిన ప్రతిసారి.. ఇలాంటి కేసులు ఇబ్బంది పెట్టడం పరిపాటి అయిపోతాయి. రేవంత్ రెడ్డి వీటన్నటిని తట్టుకుని నిలబడగలగాలి.
కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలు అయితే కనిపించడం లేదు. కాబట్టి.., ముందు పార్టీని బలోపేతం చేసుకుని, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ రేవంత్ ముందుకి పోవాల్సి ఉంటుంది.
ఇలాంటి అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీటి విషయంలో గనుక రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించగలిగితే తెలంగాణ కాంగ్రెస్ మళ్ళీ రేసులోకి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.