రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పటి వరకు ఒకరిపై దారుణంగా విమర్శలు, ఆరోపణలు చేసుకున్న నేతలు.. ఆ వెంటనే కలిసిపోతారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రలు, శత్రువులు ఉండరని అంటారు. తాజాగా చంద్రబాబ నాయుడు, జేపీ నడ్డా ట్వీట్‌లు చూస్తే.. ఈ మాట నిజం అనిపిస్తోంది. అంతేకాక పొత్తులకు సంబంధించి కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వివరాలు..
హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారా.. టీడీపీ, ఏంటి బీజేపీతో కూటమి ఏంటి.. అసలు ఇది ఎనిమిదో వింత లాగా ఉంది కదా.. ఉప్పు, నిప్పులా ఉండే టీడీపీ, బీజేపీ మధ్య.. పొత్తు ఉండటం, కూటమిగా ఏర్పడటం ఏంటి.. అని ఆలోచిస్తున్నారా. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిగా పోటీ చేశాయా.. ఒకవేళ చేశాయి అనుకుందాం.. కానీ ఫలితాలు ఇంకా రాలేదు కదా.. మరి బీజేపీ-టీడీపీ కూటమి ఎక్కడ ఎన్నికల్లో నిలబడింది.. ఎక్కడ పోటీ చేసింది.. విజయం సాధించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా. మరి అంత బుర్ర బద్దలు కొట్టుకోకండి.. ఈ సంఘటన చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. మరి ఎక్కడ అంటే ఆ వివరాలు..
కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగు దేశం పార్టీ జెండా రెపరెపలాడింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తులో భాగంగా కూటమిగా పోటీ చేసి.. పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పీఠం టీడీపీ దక్కించుకుంది. తెలుగు దేశం మహిళా నేత సెల్వి.. వార్డు నంబర్ 5 నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికల్లో విజయం సాధించి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి చేపట్టారు.
టీడీపీ అభ్యర్థి అయిన సెల్వి.. పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి చేపట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. సెల్వి మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి ఎన్నిక కావడం హర్షణీయమన్నారు. టీడీపీ- బీజేపీ కూటమిపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమే సెల్వి నియామకమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆమె తన పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా, 2022 పోర్టుబ్లెయిర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు దక్కగా, కాంగ్రెస్- డీఎంకే కూటమి 11 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ తరఫున పోటీ చేసిన మహిళా నేత సెల్వి.. 5వ వార్డు నుంచి.. హమీద్.. 1వ వార్డు నుంచి గెలుపొందారు. టీడీపీ గెలిచింది 2 స్థానాలే అయినా, పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటులో కీలకంగా మారింది. ఈ క్రమంలో, టీడీపీ అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్- బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం బీజేపీకే మద్దతు ప్రకటించింది. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ పదవిని ఫస్ట్ టర్మ్ బీజేపీ అభ్యర్థి చేపట్టారు. తాజాగా, ఇప్పుడు రెండో దఫాలో టీడీపీకి అవకాశం వచ్చింది.
దీనిలో భాగంగా ఛైర్ పర్సన్ పదవికి టీడీపీ నేత సెల్వి పోటీపడగా బీజేపీ ఆమెను బలపరిచింది. ఛైర్ పర్సన్ బలపరీక్ష ఎన్నికల్లో సెల్వికి 14 ఓట్లు రాగా, కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ నేత సెల్వి పోర్టు బ్లెయిర్ మున్సిపల్ ఛైర్మన్ గా విజయం సాధించారు. మరోవైపు బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు తెలుపుతూ.. నడ్డా ట్వీట్ చేశారు. పోర్ట్‌బ్లెయిర్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేశామని, అవి ఫలించాయన్నారు నడ్డా.
ఇక పోర్ట్ బ్లేయర్‌లో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధించడంతో.. కొత్త ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజా పరిణామంతో బీజేపీ-టీడీపీ పొత్తుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. కానీ 2019 ఎన్నికల ముందు.. బీజేపీ పట్ల చంద్రబాబు వైఖరిని స్పష్టంగా చూసిన కమలం పార్టీ నేతలు.. ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయ. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు పవన్.
ఈ క్రమంలో పోర్టు బ్లేయర్‌లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో.. ఏపీలో పొత్తుల వ్యవహారంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక చంద్రబాబు నాయుడు మంగళవారం చేసిన ట్వీట్‌లో కూడా టీడీపీ-బీజేపీ కూటమిపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని పేర్కొన్నారు. తద్వారా, బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆసక్తిగా ఉన్నారని అర్థం అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదలా ఉంచితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా టీడీపీ-బీజేపీ పొత్తుపై ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే ఎన్నికల ముందు ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు కడతాయా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Congratulations to TDP’s Smt. S Selvi on being elected the Chairperson of the Port Blair Municipal Council in alliance with BJP. Her appointment is a reflection of people’s faith in the alliance as a harbinger of progress. I wish her a successful tenure in the service of people. pic.twitter.com/iQ8AsnDvuR
— N Chandrababu Naidu (@ncbn) March 14, 2023
Congratulations to the BJP-TDP alliance on this impressive victory in the Port Blair Municipal Council election. Your hard work & dedication for the people of Port Blair have paid off & this victory is a testament to the trust that the people have in PM @narendramodi Ji’s vision.
— Jagat Prakash Nadda (@JPNadda) March 14, 2023