ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం తన పాలన కూల్ గానే సాగిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా గగ్గోలు పెడుతున్నా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా రెప రెపలాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తీసుకు వస్తున్న వినూత్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.. దాంతో ఆయనపై ప్రజల నమ్మకం కూడా బాగానే పెరిగిపోయిందని అంటున్నారు వైసీపీ నేతలు.
రాష్ట్రం ఆర్థికలోటుతో సతమతమవుతున్నా.. కరోనా ఇబ్బందులు ఉన్నా జగన్ సర్కార్ ఏమాత్రం ఆలోచించకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80శాతానికిపైగా అమలు చేసినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. పీలో ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. కడప జిల్లా బద్వేల్లో జరుగాల్సిన ఉప ఎన్నిక సైతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఎన్నికకు మరో ఆరునెలల సమయం పట్టొచ్చు. ఇక జగన్ సర్కారు మరో రెండున్నరేళ్లపాటు ఎలాంటి ఢోకా లేకుండా అధికారంలో ఉండనుంది. ఎలాంటి పాలన అయినా ఎక్కడో అక్కడ లోటుపాట్లు ఉంటాయి.. వాటిని ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో పోలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉండటం గమనార్హం. కొన్ని పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నారా? అనే దానిపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతున్నది.
తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ఓ అరగంటసేపు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే) పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కు పీకే టీం సలహాలు, ఎన్నికల వ్యూహాలు తోడవడంతో గత ఎన్నికల వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం ముందస్తు వ్యూహ రచనలు చేస్తున్నాట్లు చర్చ నడుస్తుంది.
ఇక 2024లో జరగబోయే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారని సీఎం జగన్ మంత్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. పీకే బృందం 2022కల్లా రాష్ట్రానికి వస్తుందని సీఎం జగన్ తెలిపినట్లు సమాచారం. జగన్ సర్కారుపై గడిచిన రెండేన్నళ్లలో ఎలాంటి రిమార్క్ లేదని దీనిని ఇలా కంటిన్యూ చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారట. ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని సీఎం జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ మరోసారి పీకేను రంగంలోకి దింపనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ గతంలో మాదిరిగానే సూపర్ హిట్ అవుతుందో లేదో ముందు ముందు చూడాల్సిందే.