విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందంటూ బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. హరీశ్ కామెంట్స్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది తమ విజయమంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించుకుంది. ఏపీ ప్రజలకు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అభినందనలు కూడా చెప్పారు. తాము ప్రశ్నించ బట్టే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అయితే హరీశ్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తనదైనశైలిలో హరీశ్ కామెంట్స్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కేంద్రం దిగిరాలేదా అంటూ ప్రశ్నించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడంపై హరీశ్ రావు మాట్లాడుతూ.. “నేను ఎక్కడో విశాఖ ఉక్కు గురించి మాట్లాడా. కేసీఆర్ మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. లేదు స్టీల్ ప్లాంట్ అమ్మం.. బలోపేతం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం, కేసీఆర్ విజయం, నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల విజయం. విశాఖ ఉక్కుపై అధికార పక్షం ప్రశ్నించలేదు, ప్రతిపక్షం ప్రశ్నించలేదు. రెండు పార్టీలు నోరు మెదపక పోయినా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటాం. అన్యాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో గులాబి జెండా అండగా ఉంటుంది” అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
హరీశ్ రావు కామెంట్స్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. “బాగా దిగొచ్చింది కేంద్రం.. చాలా దిగొచ్చింది. తెలంగాణలో దిగిరాలేదా కేంద్రం? సింగరేణి అమ్మేస్తున్నాం అని చెబుతున్నారుగా. అక్కడ దిగి రావట్లేదా కేంద్రం? కేసీఆర్ పై హరీశ్ రావుకు అసహనం. కేసీఆర్ పై కడుపురగిలితే ఏపీలో ప్రభుత్వాన్ని కదిలిస్తారు. అప్పుడు మనం సీఎంనేగా తిడతాం. జీతాలు ఇవ్వలేరు, హైదరాబాద్ తప్పితే ఏం ఉంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తి అని అంటాం. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో రోడ్లు చూద్దాం పదండి. భద్రాద్రి రామయ్య గారిని చూద్దాం పదా.. ఇల్లెందులో రోడ్లు చూద్దాం పదండి. ఆదిలాబాద్ లో రోడ్లు చూద్దాం పద. ఎంతసేపు హైదరాబాద్, సిద్ధిపేటలో చూస్తే సరిపోతుందా? కేసీఆర్ ని తిట్టాలంటే మాతో తిట్టించాలా?” అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.