వైసీపీ ప్లీనరీ ప్రారంభ వేళ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ రాజకీయంగా డిబేట్‌కు కారణమవుతోంది. 2017 లో పార్టీ ప్లీనరీ వేదికగా నవరత్నాలను ప్రకటించిన జగన్.. ఆ తరువాత మేనిఫెస్టోలో వాటినే పొందుపర్చి ..అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్నారు. అయితే, అందులోని లోపాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పథకాల వారీగా ప్రశ్నలు సంధించారు. రైతు భరోసా ద్వారా 64 లక్షల మందికి మేలు చేస్తామని చెప్పి 50 లక్షల మందికే అమలు చేయటం నిజం కాదా అని ప్రశ్నించారు.
మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే పరిహారం ఇవ్వటం నిజం కాదా అంటూ నిలదీసారు. అమ్మ ఒడి పథకం 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి..83 లక్షల మందికి ఇచ్చినట్లుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. పెన్షనర్ల జాబితా నుంచి 5 లక్షల మందిని తొలిగించటం నిజం కాదా అంటూ పవన్ ప్రశ్నించారు. 2018-19 లో మద్యం ఆదాయం రూ 14 వేల కోట్లు ఉండగా, 2021-22లో ఆ మొత్తం రూ 22 వేల కోట్లకు చేరింది. మీ పాలనలో మద్యపాన నిషేధం అంటే ఇదేనా అని నిలదీస్తూ.. ఈ ఆదాయం చూపించే రూ 8 వేల బాండ్లు అమ్మలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. మరి పవన్ సంధించిన ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022