కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన జనసేనలో చేరటం లేదట.. టీడీపీలో చేరబోతున్నారట. చేరికకు సంబంధించి తేదీ కూడా ఖరారు అయిందట.
రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు.. శాశ్వత మిత్రువు ఉండడు. రాజకీయ లెక్కలు అన్నవి పరిస్థితులకు తగ్గట్టు మారుతూ ఉంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న రూల్ ఇక్కడ బాగా వర్తిస్తుంది. అందుకే ఓ పార్టీ నచ్చక బయటకు వచ్చేవారిని అక్కున చేర్చుకోవటానికి, ఆదరించటానికి మిగిలిన పార్టీలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత స్పీడుగా ఉంటే పార్టీ అంత బలంగా తయారు అవుతుంది. కానీ, ఇలాంటి విషయాల్లో జనసేన పార్టీ, పార్టీ అధినాయకుడు పవన్ కల్యాణ్ చాలా స్లోగా ఉన్నారా? అంటే ఇది నిజమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయా విశ్లేషకులు ఇందుకు కన్నా లక్ష్మీనారాయణనే ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ ఏపీలో ఉనికిని కోల్పోయిన తర్వాత 2014లో బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. కొన్ని సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. సోము వీర్రాజు ఆ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత కన్నాలో అసంతృప్తి పెరిగిపోయింది. సొంత పార్టీపై, సోము వీర్రాజుపై బహిరంగంగా కామెంట్లు చేస్తూ వచ్చారు. కొన్ని నెలల ముందునుంచే ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ అవకాశాన్ని పక్క పార్టీలు వాడుకోవటానికి చూశాయి. తమ పార్టీలోకి రమ్మని కన్నాకు ఆహ్వానాలు పంపాయి.
జనసేన కూడా ఓ ప్రయత్నం చేసింది. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. కన్నా బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారన్న దానిపై క్లారిటీ రాలేదు. అందరూ ఆయన జనసేనలో చేరతారని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టీడీపీలో చేరటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారట. దాదాపు 30 ఏళ్లకు పైగా ఆయన టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నారు. అలాంటిది ఆయన టీడీపీలో చేరాల్సిన అవసరం ఎందుకొచ్చింది?..
కన్నా బయటకు రాగానే పవన్ ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేసుండాల్సింది. సామాజికవర్గం పరంగా.. గుంటూరు జిల్లాపై పట్టు ఉన్న నాయకుడిగా కన్నాకు మంచి పేరుంది. అది జనసేనకు ప్లస్ అయి ఉండేది. జనసేనకు కన్నా గెలుపు గుర్రంలా మారేవారు. అదే సమయంలో కన్నాకు ఎన్నికల్లో పోటీ చేయటానికి ఓ ప్లాట్ ఫాం కావాలి. అది పవన్ పార్టీ అయితే, ఇంకా బాగుండేది. కానీ, జనసేన నుంచి పవన్ కల్యాణ్ నుంచి కన్నాను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా జరగలేదని రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఓ రాజకీయ పార్టీ నడుపుతున్న వ్యక్తిగా పవన్ కొన్ని విషయాల్లో మారక తప్పదు. ముఖ్యంగా సీనియర్లను పార్టీలోకి ఆకర్షించే విషయంలో.. సినిమాలో హీరోగా నిర్ణయాలు తీసుకుంటే.. రాజకీయాలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పవన్ నేరుగా కన్నాతో సంప్రదింపులు జరిపి ఉంటే ఆయన టీడీపీలో చేరే అవకాశం? ఉండేది కాదని అంటున్నారు. ఇదే సమయంలో మరో వాదన గట్టిగా వినిపిస్తోంది. అది కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ చేరికకు సంబంధించింది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, పార్టీ నేతల కారణంగా కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మొదట ఆయన జనసేన వైపు మొగ్గు చూపినప్పటికి.. జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఉండటం ఆయన్ని ఆలోచించేలా చేసిందట. బీజేపీతో సంబంధాలు ఉన్న పార్టీలో తాను చేరకూడదని ఆయన భావించారట. అందుకే టీడీపీలోకి వెళ్లటానికి నిశ్చయించుకున్నారట. మరి, కన్నా జనసేనలోకి కాకుండా టీడీపీలోకి వెళ్లబోవటానికి కారణాలు ఏమయిఉంటాయో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.