జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. మరో ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలని భావించారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్.. ప్రత్యేకంగా.. వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించాడు. వాహనం ట్రయల్ రన్ సందర్భంగా తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరలయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా వారాహి వాహనం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా వారాహి రంగుపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. వారాహి కలర్ ఉందని విమర్శలు వస్తున్నాయి. చట్టం ప్రకారం ఆర్మీ వాహనాలకు మాత్రమే ఈ కలర్ వేయాలని.. ఆలీవ్ గ్రీన్ రంగు ఉంటే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవదని సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలకు.. మిలటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ కలర్ వేసుకోవటం మోటార్ వెహికల్స్ యాక్ట్‌కు విరుద్ధమంటున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ 1989.. చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప ఇతర ప్రైవేట్ వ్యక్తులు.. తమ వాహనాలకు అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిబంధనలకు విరుద్ధం అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా వారాహి రంగు వివాదంపై జనసేనాని స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘‘మొదట నా సినిమాలు ఆపేశారు.. ఆ తర్వాత విశాఖపట్నంలో నన్ను వాహనం నుంచి.. ఆ తర్వాత హోటల్ రూమ్ నుంచి.. బయటకు రానివ్వలేదు.. ఆ తర్వాత నన్ను బలవంతంగా సిటీ నుంచి పంపించి వేశారు. మంగళగిరిలో నా వాహనం బయటకు వెళ్లనివ్వలేదు. తర్వాత నన్ను నడవనివ్వలేదు.. ఇప్పుడు నా వాహనం రంగు మీకు సమస్యగా మారిందా.. సరే.. ఇక చివరకు నేను ఊపిరి తీసుకోవడం కూడా మానేయాలా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆలీవ్ గ్రీన్ కలర్ షర్ట్ పోస్ట్ చేసి.. కనీసం దీన్ని వేసుకోవడానికి అయినా నాకు అనుమతి ఉందా లేదా అని ఘాటుగా ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
Am I allowed to wear this shirt ‘YCP’? At least…?? pic.twitter.com/2ybkgx9LXV
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
వారాహి రంగుపై వస్తున్న విమర్శలపై జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వాహనానికి ఏ రంగు వేశామో చూడకుండానే.. రవాణాశాఖ అనుమతిస్తుందని.. అనుకుంటున్నారా. మా వాహానికి అనుమతి వచ్చింది అంటే.. నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు వేశామని అర్థం. ఈ వాహనం రంగు.. నిబంధనలకు అనుగుణంగానే ఉందని.. పవన్ నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటారని నాందెడ్ల మనోహర్ స్పష్టం చేశారు.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022