సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన గిరిజన బాలిక హత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తుంది. బాలిక కుటుంబాన్ని ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా బాలిక కుటుంబంతో మాట్లాడారు. బాలికకు న్యాయం జరిగే వరకూ అన్ని విధాలా అండగా ఉంటానని అభయం ఇచ్చారు. పవన్‌కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని మంగళవారం బాలిక బంధువులు మీడియా ద్వారా కోరుకున్న సంగతి తెలిసిందే. వెంటనే స్పందించిన పవన్‌కళ్యాణ్ బుధవారం సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చేరుకుని మానసికంగా కుంగిపోయిన బాలిక కుటుంబానికి ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజంలో మాట్లాడుకోడానికి కూడా వీలు లేని విధంగా ఘటన ఉందని, ఆడుకోడానికి బయటికి వెళ్లిన బిడ్డకు ఇలా జరగడం దారుణమన్నారు. మీడియా కూడా ఇలాంటి విషయాన్ని హైలెట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు బిడ్డకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిందితుడికి సరైన శిక్ష పడేవరకూ జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ అక్కడి వస్తున్న సందర్భంగా జనం పెద్దసంఖ్యలో చేరుకున్నారు. బాలికకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.