నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను తుఫానుకి కారణం అవుతోంది. ఇప్పటికే ఈ అరెస్ట్ పై వివిధ పార్టీల నేతలు స్పందించారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఎంపీ రఘురామ కృష్ణరాజుని శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనపై సీఆర్ పీసీ 50 (2) ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ కృష్ణరాజు వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సెక్షన్ ఏంటి? వారెంట్ ఎక్కడ అంటూ ఆయన సీఐడీ అధికారులను ప్రశ్నించారు.కానీ.., పోలీసులు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆయనని సీఐడీ కార్యాలయానికి తరలించి విచారణ ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని… దానికే అరెస్ట్ లు చేస్తారా అని జగన్ తీరుపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎంపీ అరెస్టుకు ఇదా సమయం అని పవన్ ప్రభుత్వవాన్నినిలదీశారు.ఒక వైపు ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి ప్రజలను రక్షించాల్సింది పోయి, ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమర్ధింపు చర్య కాదని అన్నారు. ప్రభుత్వాన్ని తరచూ తీవ్రంగా విమర్శిస్తున్నాడని… సమయం, సందర్భం లేకుండా ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఓ పక్క కరోనా సోకిన వారు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని పవన్ కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇక ఎంపీని శుక్రవారం శుక్రవారం అర్ధరాత్రి వరకు డీఐజీ సునీల్, సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు కుట్రపన్నారని.. ఎవరి ప్రోదల్బంతో పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరా తీశారు. ఇక ఈ విచారణలో కొన్ని కీలక అంశాలను రాబట్టారట సీఐడీ అధికారులు. ఇదే సమయంలో రఘురామ కృష్ణరాజు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఇక ఎన్ని రోజులు వరుసగా వీడియోస్ చేయడానికి ఆయనకి సాంకేతిక సహకారం అందించిన వారు ఎవరు అన్న దిశగా కూడా సీఐడీ అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది.