జనసేన 10 వ ఆవిర్భావ సభ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో వేడి పెంచాయి. పవన్ మాటలు పరిశీలిస్తే.. ఈ సారి పక్కా అసెంబ్లీలో అడుగుపెడతారని అర్థం అయ్యింది. దానికి తగ్గట్టే తన వ్యూహాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది. నేటితో పార్టీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ ఏటలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో 10వ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికకు ‘అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదిక’ అని పేరు పెట్టారు. ఈ ఆవిర్భావ సభకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. జనసేన కార్యకర్తలు, అభిమానులతో సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. వారాహి వాహనాన్ని వందల సంఖ్యలో బైకులతో అభిమానులు అనుసరిస్తూ వచ్చారు. అభిమానులు అడుగడుగునా గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు. ఇక పవన్ కళ్యాణ్ వారాహిపై ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఎక్కడికక్కడ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో.. దారంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో 4 గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. పామర్రులో వారాహి వాహనం దిగి ప్రత్యేక కారులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి.
రానున్న అసెంబ్లీ ఎన్నికలు, జనసేన వ్యూహాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ప్రయోగాలు చేయను.. జనసేనను బలి చేయను అని తెలిపారు. తనతో పాటు పోటీ చేసే ప్రతి జనసేన నాయకుడు గెలిచి అసెంబ్లీకి వెళ్లే విధంగా ఈ సారి పార్టీ వ్యూహం ఉంటుందని పవన్ కళ్యాణ్.. కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అంతేకాక పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది డైరెక్ట్‌గా తేల్చకుండా.. జనాల మనసులో ఉన్నదే ఈసారి నేరవేరుతుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి.. అన్ని ప్రాంతాల నుంచి రిపోర్టులు తెప్పించుకొని.. ఒంటరిగా పోటీ చేస్తేనే మేలంటే.. సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానన్నారు పవన్ కళ్యాణ్. గతంలో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో.. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి బంధం ఉందో ఈ సందర్భంగా వివరించారు పవన్ కళ్యాణ్. వైసీపీ ఎందుకు తనను 175 స్థానాల్లో బరిలో దిగమని సవాల్ చేస్తుందో తనకు తెలుసని.. వారు ఒకటి జరగకూడదు అని కోరుకుంటున్నారు.. అలానే జనాలు ఒకటి జరగాలని కోరుకుంటున్నారని.. కానీ ప్రజల మనసులో ఉన్నదే జరిగి తీరుతుంది అంటూ పొత్తులపై తన మనసులో మాట చెప్పారు పవన్.
టీడీపీతో పొత్తు, జనసేన 20 సీట్లకే పరిమితం అంటూ వాట్సాప్‌లో వచ్చే మెసేజులు అన్ని చదివి నమ్మేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాక కానీ ఈ సారి అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లనని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకునే బాధ్యత తనదే అన్నారు పవన్ కళ్యాణ్. తనతో పాటు పోటీ చేసే జనసేన నాయకులు అంతా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెడతారని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మరి ఈ సారి ఏపీలో ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.