రాజకీయ నాయకులకు సాధారణంగానే శత్రువులు ఎక్కువగా ఉంటారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎక్కడి వెళ్లినా గానీ అనుచరులను, సెక్యూరిటీని వెంటబెట్టుకుని వెళ్తుంటారు సదరు నాయకులు. అయితే ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికి నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు జరిగిన సంఘటనలు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో అర్ధరాత్రి టీడీపీ నాయకుడిపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి కొందరు దుండగులు సదరు నాయకుడి ఇంట్లోకి చొరబడి రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో టీడీపీ నేతపై కాల్పులు జరిగాయి. దాంతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ MPP బాలకోటిరెడ్డిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బాలకోటిరెడ్డి ఇంట్లోకి చొరబడి ఆయనపై రెండు రౌండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో తీవ్రంగా గాయపడిని బాలకోటిరెడ్డిని చికిత్స కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఈ దాడి చేసింది ప్రత్యర్థులా? లేక అంతర్గత పార్టీ సభ్యులేనా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆరు నెలల కిందటే బాలకోటిరెడ్డిపై కత్తులతో దాడి జరిగింది. ఆ దాడిలో తప్పించుకున్న బాలకోటిరెడ్డిపై ఈ సారి కాల్పులు జరపడం స్థానిక రాజకీయాల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఏపీ పల్నాడు రాజకీయాలు ఈ ఘటనతో ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే గత దాడికి, ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.