రాష్ట్ర విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్వార్థం కోసం హడావుడిగా ఏపీని విభజించిందని.. అందువల్లే ఈ సమస్యలు తలెత్తాయని అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ‘‘ఏపీ విభజన బిల్లు ఆమోదం సమయంలో సభలో మైకులు ఆపేసి.. తలుపులు మూసి.. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టి.. రాక్షసంగా ప్రవర్తించారు. ఏలాంటి చర్చ లేకుండా రాష్ట్రాన్ని విభజించారని’’ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అహంకార, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం.. ఏపీ విభజన తీరు సరిగా లేదు.. ఆనాడే.. సరిగా విభజించి ఉంటే.. ఇనాడు ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు.
తాము రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని.. కాంగ్రెస్ ఏపీని నాశనం చేసిందన్నారు మోదీ. రాష్ట్ర విభజన హడావిడిగా చేశారని.. విభజన చేసిన కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇలా చేస్తారా అని మోదీ ప్రశ్నించారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో కొత్తగా మూడు రాష్ట్రాలు (చత్తీస్‌గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్) ఏర్పడ్డాయని.. అప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. వాజ్‌పేయీ హయాంలో అందరూ కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్ చేశారన్నారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణి వల్లే.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పరిస్థితి వచ్చిందని మోదీ విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేశాయి.
తెలంగాణపై మోదీకి ఎంత కక్ష్యో ఇప్పుడు తెలిసింది: తలసాని
ప్రధాని వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్, అటు అధికార టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి అన్యాయం చేస్తే.. ఎన్డీఏ ఏం న్యాయం చేసిందో చెప్పాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తుండగా.. బలి దానాలు ఆపడం కోసమే నాడు సోనియా గాంధీ పెద్ద మనసుతో ఏపీని విభజించి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోదీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రధానిపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోందన్నారు. పార్లమెంటుకు రాని వ్యక్తి మోదీ అని విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసి కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. నువ్వు ఏం న్యాయం చేశావో చెప్పు’’ అంటూ మోదీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోందన్నారు. ఏడున్నర సంవత్సరాల్లో ఆయన డ్రెస్ కోడ్ మారిందే తప్ప దేశ ప్రజల బతుకులు మారలేదంటూ తలసాని తీవ్ర విమర్శలు చేశారు.
మోదీ క్షమాపణ చెప్పాలి- రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. రాజకీయ లబ్ధి కోసం మోదీ దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఇస్తామని చెప్పి వాజ్ పేయి మోసం చేశారు. 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చెయ్యి చూపించారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘తెలంగాణ ప్రాంతంలో వందలాది మంది బలిదానాలు జరగడానికి బీజేపీనే కారణం. అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే.. వందల మంది ప్రాణాలు పోయేవి కావు కదా. ఏపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓ రాష్ట్రం పూర్తిగా నష్టపోతుందని తెలిసినా.. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేశారని’’ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అటు బీజేపీ మోదీ వ్యాఖ్యలను సమర్ధించుకునే పనిలో పడింది. మోదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.