ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. పార్టీని బలోపేతం చేసేందుకు గాను తెలుగుదేశం యువనేత నారా లోకేష్.. యువ గళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్లు నడవనున్నారు. జనవరి 27, శుక్రవారం ఉదయం 11 .03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడింది. పాదయాత్ర ప్రారంభం రోజున టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. పాయదాత్ర ప్రారంభించడానికి ముందు.. లోకేష్ తన మామ బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో తొలి రోజు.. టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ యువగళం పాదయాత్ర 400 రోజుల పాటూ 4 వేల కిలోమీటర్లు.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 125కు పైగా నియోజకవర్గాల్లో కొనసాగనుంది.
పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో.. తల్లిదండ్రులు, అత్తమామలు ఇతర కుటుంబ సభ్యులు ఆశీస్సులు తీసుకుని… దేవాలయాలు, దర్గాలు, చర్చిలలో ప్రార్థనలు చేసి తండ్రి నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు లోకేష్. అయితే యువగళం పాదయాత్ర కుప్పం నుంచే ప్రారంభించడానికి ప్రత్యేక కారణం ఉంది. రాజకీయాలకు సంబంధించి లోకేష్.. మొట్టమొదటి అడుగు పడింది కుప్పంలోనే . 2009లో తన తండ్రి తరపున లోకేష్ కుప్పుం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు అక్కడి నుంచే లోకేష్ తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన అడుగు వేస్తున్నారు. 4,000 రోజులు జరిగే యాత్రకు ప్రస్తుతానికి 3 రోజులకు పర్మిషన్ లభించింది.