ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై జగన్ సొంత మీడియా బురద జల్లిందని.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేసిందని.. కానీ వేటికి తాను భయపడను అని తెలిపారు. తప్పుడు వార్తలు రాస్తే.. చట్ట ప్రకారం ముదుకు వెళ్తానని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
నారా లోకేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపర్చేలా మాట్లాడారన్నారు. ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశానని.. తన తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని శపథం చేశారు. వైఎస్ విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి తాము మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. కానీ అది తమ సంస్కృతి కాదని.. తమకు సంస్కారం అడ్డు వస్తుందని తెలిపారు. చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో ఒక పత్రికలో వార్త రాశారని తెలిపారు. తనపై ఇలా రాసినందుకు గాను ఒక పత్రికపై రూ.75 కోట్ల రూపాయలు, మరో పత్రికపై రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేశానన్నారు. మరో మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టానన్నారు. ఒక పత్రిక క్షమాపణలు కోరిందని.. మిగిలిన రెండు పత్రికలు మాత్రం వివరణ కూడా ఇవ్వలేదన్నారు.
మొదటి నుంచీ జగన్ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని.. తాను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తలు ఆ పత్రిక రాస్తోందని లోకేష్ ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికి జరగకూడదన్నారు లోకేష్. న్యాయం పోరాటం చేస్తానన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుకూల పత్రిక తనపై, తన తండ్రిపై తప్పుడు రాతలు రాస్తుందని లోకేష్ మండి పడ్డారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.