పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే పవన్ జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ.. ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం పవన్ ప్రారంభించిన గుడ్‌మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్‌కి భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం పవన్ జోరు చూస్తుంటే.. ఈ సారి సీఎం సీటే లక్ష్యంగా ఆయన బరిలో దిగినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు మురళీమోహన్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ జోరు చూస్తేంటే.. ఆయన సీఎం కావడం పక్కా అని జోస్యం చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..
తాజాగా మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను రాజకీయాల్లో చురుగ్గా లేను.. ఏపీ పాలిటిక్స్‌పై నేను కామెంట్స్ చేయదల్చుకోలేదు. పవన్ కళ్యాణ్‌లో నాకు నచ్చిన అంశం ఏంటంటే.. కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు.. వాళ్ల వల్ల కాకపోతే వెళ్లిపోతారు.. పవన్ కళ్యాణ్ అలా కాదు.. తను సక్సెస్ అయ్యినా అవ్వకపోయినా.. పార్టీని నమ్ముకుని.. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతున్నారు. ఏదో ఒకరోజు ఆయన మంచి స్థానానికి వెళ్తారు. తప్పుకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడనేది చెప్పలేను కానీ.. ఏదోరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. అలా అయిన రోజున మా సినిమా వాళ్ల నుంచి మరొకరు ముఖ్యమంత్రి అయ్యారని గర్వపడతా’’ అన్నారు మురళీ మోహన్.
అంతేకాక ‘‘పవన్ కళ్యాణ్‌తో నేను ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ.. నేను పోటీ చేసినప్పుడు బీజేపీ, జనసేన నాకు సపోర్ట్ చేశాయి. ఆ టైంలో నా తరుపున రాజమండ్రిలో ప్రచారం చేశాడు. అయితే చిరంజీవి బ్రదర్స్‌లో మిగిలిన వాళ్లతో ఉన్నంత క్లోజ్‌గా పవన్ కళ్యాణ్‌తో లేను. ఎప్పుడూ తన పని తాను చేసుకుని పోతాడు తప్పితే మిగిలిన విషయాలు పట్టించుకోరు. అదే చిరంజీవి అయితే ఆయన రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సరదాగా ఫోన్ చేస్తే.. ఏంటన్నయ్యా.. ఏం చేస్తున్నావ్.. సరదాగా షూటింగ్‌కి రాకూడదు అని అంటారు. లంచ్ అక్కడ చేద్దాం అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పవన్ కళ్యాణ్‌తో బాగున్నారా అంటే బాగున్నారా.. అంతవరకే’’ అంటూ చెప్పుకొచ్చారు మురళీమోహన్. మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.