కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ను కంచుకోటగా తయరు చేసిన క్రెడిట్ మాత్రం ఈ కుటుంబానికే చెందుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ జెండాను దించకుండా అటు పార్టీకి ఇటు ప్రజలకు ఓ మాస్ లీడర్‌గా దూసుకెళ్తున్నాడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటి రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఇలా ఎన్నో పదవుల్లో కొనసాగారు.
ఇక ఇటీవల కాలంలో కాంగ్రెస్ హైకమాండ్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి అప్పగిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆయన టీపీసీసీ రేసులో ఉన్నా.. చివరికి ఆ పదవిని ఫైర్ బ్రాండ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన్నుకుపోయారు. దీంతో నిరాశకు గురైన కోమటి రెడ్డి ఏకంగా ఢిల్లీ నుంచి వచ్చిన మొదటి రోజే ఇక గాంధీ భవన్ మెట్లు ఎక్కనని శపథం చేశారు. ఇక ఆయన నిజంగానే గాంధీ భవన్ మెట్లు ఎక్కరా? ఈ దెబ్బతో పార్టీ మారి ఇతర పార్టీలోకి వెళ్లనున్నారా? లేదంటే మరేదైన సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారా? అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.
అలాంటి దడ పుట్టించే డైలాగ్‌లు పేల్చిన కోమటి రెడ్డి నిజంగానే తమ్ముడైన కోమటి రెడ్డి రాజగోపాల్‌తో హస్తం పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. ఇక వాటన్నిటిని పటాపంచలు చేస్తూ తాజాగా సరికొత్త రాగాన్ని ఎత్తుకున్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో జర్నలిస్ట్ ఇలా అడుగుతూ..గాంధీ భవన్ మెట్లు ఎక్కనని శపథం చేశారు..నిజంగానే ఎక్కరనుకోవాలా? అనే ప్రశ్నకు కోమటి రెడ్డి సమాధానమిస్తూ..నేను మొత్తానికి గాంధీ భవన్‌లోకి అడుగుపెట్టనని చెప్పలేదు, నా నియోజకవర్గ ప్రజలతోనే ఉంటానని, అయినా ఇప్పట్లో నాకు గాంధీ భవన్ మెట్లు ఎక్కే అవసరం లేదనే ఉద్దేశంలో అని ఉండవచ్చిన తెలిపారు.
ఇక మరి పార్టీ మారే అవకాశం ఏమైన ఉందా అనే ప్రశ్నకు..నేను పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. దీంతో మొత్తానికి దీనిని బట్టి చూస్తే కోమటి రెడ్డి మాట మార్చారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక అలా శపథం చేసిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ మాస్ లీడర్.