టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. హస్తినాకు వచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చేందుకు కేశినేని నిరాకరించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో చంద్రబాబు కు పుష్ప గుచ్ఛం ఇవ్వాలని కేశినేనిని.. ఎంపీ గల్లా జయదేవ్ కోరాడు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నాని నిరాకరించారు. మీరే ఇవ్వండంటూ పుష్ప గుచ్ఛాన్ని విసురుగా కేశినేని నాని తోసేశారు.బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ బతిమిలాడిన ఏమాత్రం పట్టించుకోలేదు.
టీడీపీ ఎంపీల సమావేశంలో కూడా కేశినేని నాని చంద్రబాబుకు దూరం దూరంగా ఉన్నారు. దీంతో నాని తీరు చర్చనీయాంశమైంది. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుపై నేరుగా అసహనం ప్రదర్శించారని చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నాని ప్రవర్తన పై రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. తనకు పోటీగా తన తమ్ముడిని చంద్రబాబు ప్రోత్సహించడంపై కేశినేని రగిలిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ స్టిక్కర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు నాని ఫిర్యాదు చేశారు. నేరుగా తమ్ముడు చిన్నిని టార్గెట్ చేశారు.
ఈ క్రమంలో నాని తమ్ముడు మరింత దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని నాని అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరి.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేశినేని నాని వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.