భారత్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు లెక్కకు అందని విధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందంటే ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ ఊసే లేకుండా వ్యూహాలు రచిస్తున్నారు.
2019లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ లో పర్యటించినప్పుడు రాహుల్ గాంధీ.. మోదీ అనే ఇంటి పేరుపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు వేశారు. మోదీ కుటుంబాన్ని అవమానించారని పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛతోనే వ్యాఖ్యలు చేశానని అన్నారు. కట్ చేస్తే ప్రస్తుతం రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం కేసు వేశారు. ఈ సెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీపై రెండేళ్ల పాటు శిక్ష పడింది. ఇది చాలదన్నట్టు రాహుల్ గాంధీపై లోక్ సభలో అనర్హత వేటు విధించారు.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే రెండేళ్ల శిక్ష పడితే.. సదరు ప్రజా ప్రతినిధి అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే సదరు ప్రజా ప్రతినిధి అనర్హుడిగా పరిగణించబడతాడు. ఈ విషయాన్ని 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అనర్హత వేటు పడితే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు దాదాపు శూన్యమైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక్కసారి ప్రజా ప్రతినిధిపై అనర్హత వేటు పడితే ఆ వ్యక్తి ఎనిమిదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశం లేదు.
ప్రస్తుతం రాహుల్ పై రెండేళ్లు జైలు శిక్ష ఉంది. ఈ రెండేళ్లు కాకుండా మరో ఆరేళ్ళు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎలా చూసినా గానీ ఎనిమిదేళ్లు రాహుల్ గాంధీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీనే. ఆ పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ రాహుల్ గాంధీ మాత్రమే. అలాంటిది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అయిన రాహుల్ గాంధీని ఎనిమిదేళ్ల పాటు రాజకీయాలకు దూరం చేస్తే ఇక ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అంతర్గతంగా పార్టీలో విబేధాలు వచ్చి పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ అనర్హత వేటును తప్పించుకోవడానికి సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్ళచ్చు. అక్కడ పని అవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. అయితే సుప్రీంకోర్టు కూడా సూరత్ కోర్టు తీర్పును సమర్ధిస్తే రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదు.
ఆ రకంగా రాహుల్ ని రాజకీయాలకు దూరం చేసే వ్యూహాన్ని మోదీ రచించారని స్పష్టంగా అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికల్లోనే కాదు, ఆపై ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ నుంచి ప్రధాని రేసులో ఉన్న అభ్యర్థి రాహుల్ గాంధీ మాత్రమే. మొత్తానికి ప్రధాని రేసులో నిలబడే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడే రాజకీయాలకు దూరమైపోతే ఇక పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే బీజేపీ కోరుకుంటుందా? కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకుందా? దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తుందా? రాహుల్ గాంధీపై మోదీ అష్టదిగ్బంధనం వర్కవుట్ అవుతుందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.