ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానం టీడీపీకి దక్కడంపై జీర్ణించుకోలేని అధికార పార్టీకీ చెందిన వైఎస్సార్సీపీ.. క్రాస్ ఓటింగ్ కారణమని తెలిసి, అందుకు కారకులైన వారిగా భావించి నలుగురి ఎమ్మెల్యేలపై వేటు వేసింది. అయితే వీరిలో ఓ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సస్పెన్షన్ తర్వాత ఆమె టీడీపీలో చేరే అవకాశాలున్నాయని భావించగా.. ఊహించని ట్విస్ట్ నెలకొంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ.. ఒక్క స్థానాన్ని టీడీపీ గెలుపొందడంపై ఆ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ కారణమని భావించిన అధికార పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేశామని, దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని చెప్పారు. అయితే ఆనం, కోటం రెడ్డి ఇప్పటికే వైసీపీపై తిరుగుబావుటా వేసిన నేపథ్యంలో ఏం స్పందించకపోయినప్పటికీ.. మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి స్పందిస్తూ.. తనపై వేటు పడటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే వీరందరిలో ఎక్కువగా వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి గురైంది మాత్రం ఉండవల్లి శ్రీదేవినే. ఆమె కార్యాలయంపై దాడి చేశారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించారు కూడా. అయితే ఇప్పుడు ఆమె మరో పార్టీలో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపి ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధను గెలిపించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. దీంతో సస్పెన్షన్ తర్వాత టీడీపీలో చేరతారని అందరూ భావిస్తుండగా.. మరో పార్టీలో చేరే అవకాశాలు స్పఫ్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని.. ఆ పొత్తులో భాగంగా తాడికొండ స్థానం జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ పొత్తు కనుక ఖరారైతే.. ఆ సీటు జనసేనకే వెళ్లనున్న నేపథ్యంలో ఆమె జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు జనసేన తరుపు అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలున్నాయి.
ఇటీవల ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ కూడా దీనికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తాడికొండ నియోజకవర్గంలో దాదాపు 15 వేల ‘కాపు’ ఓట్లు ఉన్నాయని.. వీటిని తీసుకొస్తే గెలుస్తామని వైసీపీ అధిష్టానం తమకు చెప్పిందని.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. తాము తీవ్రంగా కష్టపడితే.. వైసీపీకి కాపుల ఓట్లు 10 వేలు వస్తే.. జనసేనకు 5 వేలు పడ్డాయని వివరించారు. అందుకే 4 వేల మెజారిటీతో ఉండవల్లి శ్రీదేవి గెలిచారని స్పష్టం చేశారు. దీంతో.. శ్రీదేవి జనసేనలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. అయితే అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉన్నంత సేపు జగన్ మోక్షం కోసం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీదేవిని.. అధినేత వవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తారో లేదో వేచి చూడాల్సిందే.