ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసేందుకు తనను ప్రలోభ పెట్టారని, తన ఓట్లు కొనేందుకు చూశారని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే టీడీపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్లు ఆఫర్ తో ప్రలోభ పెట్టి వారి ఓట్లను కొనుగోలు చేసిందని.. అందుకే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ వర్సెస్ నలుగురు ఎమ్మెల్యేలు మధ్య వార్ గా మారిపోయింది పరిస్థితి. తాము ఎలాంటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని నలుగురు ఎమ్మెల్యేలు అంటుంటే.. రుజువు అయ్యింది కాబట్టే సస్పెండ్ చేశామని వైసీపీ పార్టీ అంటోంది.
ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ వ్యవహారంపై స్పందించారు. తాము డబ్బుకు అమ్ముడుపోలేదని అన్నారు. కాగా తాజాగా క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల కంటే ముందే తనకు ఆఫర్ వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని ఎమ్మెల్యే రాపాక అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టీడీపీ పార్టీ 10 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. అయితే తాను ఈ ఆఫర్ ను తిరస్కరించానని అన్నారు. తన ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని, తన ఓటు అమ్మితే 10 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు రాపాక ఆరోపించారు.
అయితే ఆయన తన రాపాక అలాంటి వ్యక్తి కాదని టీడీపీ నేతలతో చెప్పినట్లు వెల్లడించారు. అసెంబ్లీ దగ్గర కూడా ఎమ్మెల్యే రామరాజు తనను టీడీపీకి ఓటు వేయమని అన్నారని వెల్లడించారు. టీడీపీకి ఓటు వేస్తే మంచి పొజిషన్ ఉంటుందని అన్నారని, జగన్ ను నమ్మాను కాబట్టి ఆఫర్ ను తిరస్కరించానని అన్నారు. సిగ్గు శరం వదిలేస్తే 10 కోట్లు వచ్చేవని, కానీ పరువు పోతే సమాజంలో బతకలేమని.. అందుకే ఆఫర్ కు లొంగలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒక్కరోజు వారి చెప్పినట్టు వింటే 10 కోట్లు వస్తాయని, అలాగని తన దగ్గర డబ్బు లేదని అన్నారు. అయినప్పటికీ లొంగలేదని అన్నారు. మరి రాపాక చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.