వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. తనకు కావాలనే సెక్యూరిటీ తగ్గించారంటూ ఆరోపణలు చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి పలు ఆరోపణలు చేశారు. గత రెండేళ్లుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన పీఏ ఫోన్ తో పాటుగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతోందన్నారు. అందుకే తాను ఇప్పటికీ యాప్ ల ద్వారానే మాట్లాడుతున్నట్లు తెలిపారు. తనకు ప్రాణహాని కూడా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
ఇటీవల ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆ తర్వాత ఆనం పెద్దగా స్పందించింది లేదు. తాజాగా నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కావాలనే సెక్యూరిటీ తగ్గించారన్నారు. తనను అసలు భూమి మీదే లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలపై ప్రజలు అంత సంతృప్తిగా ఏమీ లేరంటూ వ్యాఖ్యానించారు. మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంకా 15 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏమైనా జరగచ్చు అంటూ ఆనం చెప్పుకొచ్చారు.
“నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. నేను హత్యా రాజకీయాలు చేయలేదు. నక్సల్స్ ప్రభావం ఉన్న 5 మండలాలు నా నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ మండలాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. కానీ, నాకు భద్రత తగ్గించారు. వేధింపులు.. సాధింపులు కొత్తకాదు. రాజ్యాంగేతర శక్తులు వెంకటగిరి వచ్చిన తర్వాతే నా కటౌట్ ను తగలబెట్టారు. నా రాజకీయం నేను చేస్తాను. అన్నింటికీ నేను సిద్ధపడి ఉన్నాను. నా పీఏ ఫోన్ తో పాటుగా నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. నేను మాఫియా గ్యాంగ్ ల ఉన్నాయని చెప్పిన తర్వాత నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నేను ఇప్పటికీ నా పిల్లలతో కూడా యాప్ ల ద్వారానే మాట్లాడుతున్నాను.” అంటూ ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.