తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారని దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించిన ఈటల అవును కలిశానని కలిస్తే తప్పేంటంటూ కౌంటర్ వేశాడు. ఇక తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాడు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయని, కలుసుకోబోతున్నాయంటు మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ కూడా కాంగ్రెస్, బీజేపీలు కలవవని ఇది దేశ మంత తెలుసంటూ భట్టి తెలిపారు. ఇక గాంధీభవన్ లోకి గాడ్సేలు రావడం కాదు.. తెలంగాణ భవన్ లోకి తెలంగాణ ద్రోహులు వచ్చారని భట్టి కేటీఆర్ వ్యాఖ్యల పట్ల స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.