విద్య, వైద్యం వంటి రంగాల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని.. ఈ విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఎందరికో మేలు జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన అందరికి ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న జేపీ.. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల సంక్షేమానికి కచ్చితంగా డబ్బు ఖర్చుపెట్టాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చివరి గడప వరకు కూడా డబ్బును పంపిణీ చేస్తున్నారు. లంచాల అవసరం లేకుండా ఈ నగదు బదిలీ జరగడం గర్వకారణం’’ అన్నారు జేపీ.
జేపీ మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిత్తశుద్ధితో రాష్ట్రంలో విద్యాప్రమాణాలు బాగుపడాలనే ప్రయత్నం జరుగుతుంది. ర్యాంకులు, మార్కులు కాదు.. విద్యా ప్రమాణాల్లో మార్పులు ముఖ్యం అని ప్రభుత్వం భావిచింది. అందుకోసం తీసుకున్న చర్యలని నేను అభినందిస్తున్నాను. విద్య, ఆరోగ్యాన్ని సామాన్యులకు అందించాలనే ఆలోచన.. ఆచరిస్తున్న తీరు అమోఘం. మళ్లీ దీని కోసం పాత పద్దతులను ఆచరించడం లేదు. అది ప్రశంసనీయం’’ అన్నారు.
‘‘పాత పద్దతులను కొంచెం మార్చి వెళ్తే.. పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే గత 60-70 ఏళ్లుగా అవే పాటిస్తున్నారు. వాటిని కొనసాగించి.. మరింత బాగా చేస్తామంటే పాత ఫలితాలే వస్తాయి. మార్పు ఉండదు. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయత్నం చేస్తుంది. అందుకే సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తూ.. వారి ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాను. దీని వల్ల ఖర్చు పెరగదు’’ అంటూ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు జయప్రకాశ్ నారాయణ. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.