తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో అనారోగ్య కారణాలతో మరణించిందనే వార్తలొచ్చినా.. పోలీసుల ఎంట్రీతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కూతురు మరణిందనే వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, నందమూరి అభిమానులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఆమె మరణవార్త తెలియకగానే ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్, పురందేశ్వరి, కళ్యాణ్ రామ్ వంటి కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి వెళ్లారు.
అయితే ఆమె పెద్ద కుమార్తె ఆమెరికాలో ఉండడంతో ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆమె కుమార్తె రావడంతో బుధవారం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉమా మహేశ్వరి మరణంపై స్పందించారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మరణం మిస్టరీగా మారిందనే అనుమానం వ్యక్తం చేశారు.
ఆమె ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె సూచించారు. ఇకపోతే ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో ఖచ్చితంగా సూసైడ్ లెటర్ రాసి ఉంటుందని, చంద్రబాబు అడుగు పెట్టగానే ఆ లెటర్ మాయమైందని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. తాజాగా లక్ష్మీ పార్వతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై లక్ష్మీపార్వతి చేసిన ఈ విధమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.