రాష్ట్రంలో గత కాలంగా ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వారం రోజుల క్రితం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సిద్ధం.. డేట్ మీరు చెప్పండి అసెంబ్లీ రద్దు చేస్తానంటూ ప్రతి పక్షాలకు సవాల్ విసిరారు. విపక్షాలు రెడీ అనేసరికి.. కేంద్రంలో మోదీ లోక్‌సభను రద్దు చేస్తే.. రాష్ట్రంలో తాము కూడా రద్దు చేస్తామంటూ మెలిక పెట్టాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే ఈటల రాజేందర్ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే ప్రచారంపై కూడా కేటీఆర్ స్పందించారు. ఇక దక్షిణాదిలో సీఎం కేసీఆర్ సాధించబోయే సంచలన రికార్డుపైనా జోస్యం చెప్పారు. వివరాలివే..
కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే తెలంగాణలో ముదస్తు ఎన్నికలకు ఆదేశించాలని.. తమంత తాముగా మాత్రం ముందస్తుకు పోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థల్లాగే ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ గుప్పిట పెట్టుకుందని విమర్శించారు. ఇక సర్వేలు చెబుతున్నంత సీన్ తెలంగాణలో బీజేపీకి లేదని, అయితే కాంగ్రెస్ స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై, బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలపైనా కేటీఆర్ స్పందించారు.
TRSలోకి ఈటెల..
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ప్రత్యర్థులపై అనూహ్యప్రచారాలకు అన్ని పార్టీలు ఊతమిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఉప ఎన్నికలో హుజూరాబాద్‌లో బీజేపీ తరఫున బరిలో దిగి.. ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌కు సంబంధించి రెండు రోజులుగా అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ఈటలతో రహస్యంగా భేటీ అయ్యారని, ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెల్లవారుజామున మణికం కారు కనిపించిందని, ఈటలతో మాట్లాడటానికి వారు వెళ్లొచ్చినట్లు ప్రచారం జరిగింది. మరో వైపు ఈటెల బీజీపీలో అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే ఆయన తిరిగి సొంత గూటికి చేరుకుంటారనే ప్రచారం కూడా రాజకీయ సర్కిళ్లల్లో జోరుగా సాగుతోంది.
ఈటల పార్టీ మార్పు అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఈటల రాజేందర్‌కు బీజేపీలో ప్రాధాన్యత లేదు. ఆయన తిరిగివస్తే టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటారన్న చర్చ ఊహాజనితమే’ అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక పోతే బీజేపీలో చేరిన ఈటెలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని.. ఆ పార్టీ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఈటెలకు ప్రాధాన్యం పెంచుతూ, చేరికల కమిటీకి ఆయనను కన్వీనర్‌గా నియమించిది బీజేపీ హైకమాండ్. ఈటెల పార్టీ మారబోతున్నారనే ప్రచారం అవాస్తవం అని ఆ పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.