ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ శాసన సభ్యుడు, మాజీమంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వంగవీటి రాధాకృష్ణ, ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంపాదించుకుంది. అసలు ఈ ముగ్గురిని ఇలా ఒకే మీదకు తీసుకువచ్చిన కార్యక్రమం ఏంటి.. వీరు ముగ్గురు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా ఇలా కలిశారా.. లేదా.. ఏదైనా పబ్లిక్ మీటింగ్‌లో ఇలా ఒకే వేదిక మీద కనిపించారా.. మరి ఈ ముగ్గురి కలయికపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది వంటి వివరాలు..
ప్రముఖ కాపు నేత, దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. సుమారు పాతికేళ్ల క్రితం అనగా.. 1988 డిసెంబర్ 26వ తేదీన.. ఆయన దారుణ హత్యకు గురయ్యారు. నిరాహార దీక్ష శిబిరంలోనే ఆయనను మట్టుబెట్టారు. వంగవీటి రంగా హత్య రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసింది. అప్పటి తీవ్రత ఇప్పటికీ కొనసాగుతోంది. నేటికి కూడా వంగవీటి రంగాది రాజకీయ హత్యగానే అభివర్ణిస్తుంటారు. ఈ క్రమంలో వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకుని.. విజయవాడ సమీపంలోని నున్నలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యారు.
విగ్రహం ఆశిష్కరణ అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘ప్రజల కోసమే వంగవీటి రంగా జీవించారు. తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సామాన్యుల కోసం పని చేశారు. ప్రజల కోసం వ్యవస్థలను ఎదిరించారు’’ అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాను తన తమ్ముడిగా వర్ణించారు. తన తమ్ముడు రాధా బాబు అడిగితే.. ఆయన అభిమానులు వెయ్యి ఇళ్లను ఖాళీ చేసి తనకు ఇస్తారని.. రాధాపై ప్రజల్లో ఉన్న అభిమానం అలాంటిదని కొడాలి నాని ప్రశంసించారు. తండ్రి ఆశయాలను సాధించడానికి రాధా నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు.
వంగవీటి రాధా ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని ఈ సందర్భంగా కొడాలి నాని ప్రశంసించారు. డబ్బులిస్తాం, రాజ్యసభకు పంపిస్తాం.. ఏది కోరితే అది చేస్తామని హామీ ఇచ్చినా.. సరే.. రాధా అలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తన తండ్రి తనకు ఇచ్చి వెళ్లిన ప్రజలే తనకు అతిపెద్ద ఆస్తిగా రాధా భావిస్తారు. రంగా ఆశీస్సులు, ప్రజల ప్రేమాభిమానాలు రాధాకెప్పుడు ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. ఇలా ఈ ముగ్గురు నేతలు ఒకే వేదిక మీద కనిపించడం.. రాధాను.. తన తమ్ముడంటూ నాని వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.