టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేసీఆర్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నేడు (డిసెంబర్ 9న) బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ శుభ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ సంబరాల్లో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే నటుడు ప్రకాష్ రాజ్ కి.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కర్ణాటక లేదా తమిళనాడు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్ ని నియమించనున్నట్లు సమాచారం. 2019లో ప్రకాష్ రాజ్.. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మరలా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్ని స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులు, మరికొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ప్రకాష్ రాజ్ ని బీఆర్ఎస్ తరపున బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీకి ఇటు ప్రకాష్ రాజ్ వ్యతిరేకం, అటు కేసీఆర్ కూడా వ్యతిరేకమే. ఈ క్రమంలో బీజేపీని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో రాజకీయాలు తప్పవని భావించిన కేసీఆర్… ప్రకాష్ రాజ్ లాంటి చరిష్మా ఉన్న వ్యక్తులను కలుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్.. కన్నడలోనే కాకుండా.. తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయన నటించిన సినిమా భాషలన్నీ ఆయనకు వచ్చు. కాబట్టి ఏ ప్రాంతంలో నిలబెట్టినా ప్రకాష్ రాజ్.. ఓటర్లను ఆకట్టుకోగలరన్న నమ్మకంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ క్రేజ్ ని వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ప్రకాష్ రాజ్ క్రేజ్.. బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.